మారణాయుధాలతో మరోసారి చెడ్డీగ్యాంగ్ హల్‌చల్

కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న చెడ్డీగ్యాంగ్ మళ్లీ వీధుల్లో పడుతున్నారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2023 7:15 PM IST
Cheddi Gang, Hulchul, Sangareddy, CCTV,

మారణాయుధాలతో మరోసారి చెడ్డీగ్యాంగ్ హల్‌చల్

కొంతకాలం ముందు చెడ్డీగ్యాంగ్‌ దొంగతనాలకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేశారు. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న చెడ్డీగ్యాంగ్ మరోసారి వీధుల్లో పడుతున్నారు. అర్ధరాత్రులు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మారణాయుధాలతో తిరుగుతున్న వీడియోలు అందరినీ భయపెడుతున్నాయి. పలు కాలనీల్లో చెడ్డీగ్యాంగ్ తిరిగి ఇళ్లలోకి చొరబడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

సంగారెడ్డి జిల్లాలో చెడ్డి గ్యాంగ్ హల్‌చల్ చేస్తోంది. పోలీసులు వీరిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిన చెడ్డి గ్యాంగ్ ఇప్పుడు మళ్లీ నగరంలో హల్‌చల్ సృష్టిస్తున్నారు. మారుణ ఆయుధాలతో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. అమీన్‌పూర్, రామచంద్రపురంలోని పలు కాలనీల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్‌గా చేసుకొని ముందుగా రెక్కి నిర్వహిస్తున్నారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో పనోరమ కాలనీలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చెడ్డి గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. మూడు ఇళ్లల్లో11 తులాల బంగారం, పదివేల నగదు తీసుకొని పారిపోయారు. వరుసగా మూడు ఇండ్లలో దొంగతనాలు జరగడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చెడ్డి గ్యాంగ్ ఓ ఇంట్లో దొంగతనం చేయడమే కాకుండా ఫ్రిడ్జ్ లో ఉన్న ఆహారాన్ని కూడా తిన్నట్లుగా తెలుస్తోంది. దొంగతనం జరిగిన ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. చెడ్డి గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులను పోలీసులు సూచిస్తున్నారు. తాళం వేసి ఫంక్షన్లకు కానీ... ఊరికి కానీ... వెళితే చుట్టుపక్కల ఉన్నవారికి లేదంటే స్థానిక పోలీసులకు చెప్పాలని సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో విలువైన వస్తువులు, నగదు పెట్టకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.

Next Story