బిగ్‌బాస్‌లో ఛాన్స్‌ పేరుతో మోసం.. పోలీసులకు యువతి ఫిర్యాదు

సినిమాల్లో నటించాలనేది చాలా మంది యువత కల. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  21 Jan 2024 5:16 AM GMT
Cheating, Bigg Boss, case booked, telangana,

బిగ్‌బాస్‌లో ఛాన్స్‌ పేరుతో మోసం.. పోలీసులకు యువతి ఫిర్యాదు

సినిమాల్లో నటించాలనేది చాలా మంది యువత కల. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సొంత గ్రామాలను.. తల్లిదండ్రులు, బంధువులకు దూరంగా ఉంటూ తమ వంతు కృషి చేస్తుంటారు. ఇలా ప్రయత్నించిన వారిలో ఎక్కడో ఒక్కరిద్దరు మాత్రమే సక్సెస్‌ అవుతున్నారు. అయితే.. మిగతా వారు తాము అనుకున్న స్థాయికి వెళ్లలేకపోయినా.. తమకు అందిన పనులు చేసుకుంటూ జీవితాన్ని లాక్కొస్తుంటారు. ఇక అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతికి బిగ్‌బాస్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.

బిగ్‌బాస్‌ షో అంటే తెలియని వారు ఉండరు. ఈ షోలో పాల్గొని బయటకు వెళ్లిన తర్వాత వారి రేంజ్‌ మారిపోతుంది. సినిమాల్లో.. సీరియల్స్‌.. ఇతర షోస్‌లో అవకాశాలు బాగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో చాలా మంది సాధారణ వ్యక్తులు కూడా ఇందులోకి ఒక్కాసారి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే ఓ అమ్మాయి కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలని కలలు కన్నది. బిగ్‌బాస్‌ షో ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న అనే అమ్మాయి యాంకర్‌గా పనిచేస్తోంది. పలు చానెళ్లు, ప్రయివేట్‌ కార్యక్రమాల్లో యాంకర్‌గా పనిచేసింది. అయితే.. స్వప్నకు స్టార్‌మా ప్రొడక్షన్‌ ఇన్‌చార్జ్‌ అంటూ గతేడాది సత్య అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆమెను బిగ్‌బాస్‌లోకి పంపిస్తానని చెప్పాడు. గత జూన్‌ నెలలో బిగ్‌బాస్ ఇన్‌చార్జి అంటూ రాజును పరిచయం చేశాడు.

స్వప్నను పరిచయం చేసుకున్న రాజు, సత్య బిగ్‌బాస్‌లోకి రావాలంలో రూ.5లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వారి మాటలు నమ్మిన స్వప్న పలు దఫాలుగా రూ.2.50 లక్షలు ఇచ్చింది. రిటర్న్‌గా అగ్రిమెంట్‌ చెక్‌ అందించారు. తప్పకుండా అవకాశం వస్తుందని భావించిన ఆమెకు నిరాశే ఎదురైంది. తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరితే అవి కూడా చెల్లించలేదు. దాంతో.. ఇటీవల యువతి తనని ఫలానా వ్యక్తులు బిగ్‌బాస్‌లోకి పంపుతానంటూ మోసం చేశారని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు జగద్గిరిగుట్టకు చెందిన రాజుని అరెస్ట్ చేశారు. సత్య కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Next Story