మొబైల్‌ స్నాచింగ్ దొంగలు అరెస్ట్, రూ.1.75 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు సీజ్

ఎట్టకేలకు వరుసగా మొబైల్‌ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  26 April 2024 4:45 PM IST
cell phone,  gang arrest, hyderabad, commissioner srinivas reddy,

మొబైల్‌ స్నాచింగ్ దొంగలు అరెస్ట్, రూ.1.75 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు సీజ్ 

రద్దీగా ఉన్న ప్రాంతాల్లో దొంగలు తమ చేతివాటం చూపిస్తుంటారు. జేబుల్లో ఉండే పర్సులు, నగదుతో పాటు సెల్‌ఫోన్లను మనకే తెలియకుండా తస్కరిస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగరంలో మొబైల్‌ చోరీల కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో.. వీటిపై పోలీసులు ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఎట్టకేలకు వరుసగా మొబైల్‌ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్‌ చేశారు. మొత్తం 17 మందిని అరెస్ట్‌ చేయగా.. నిందితుల నుంచి 703 స్మార్ట్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. అయితే.. ఈ పట్టుబడ్డ సెల్‌ఫోన్ల విలువ రూ.1.75 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ నగరంలో మొబైల్‌ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ముఠా నడుచుకుంటూ వెళ్తున్నవారిని టార్గెట్‌ చేసుకుని మొబైల్‌ స్నాచింగ్‌ చేస్తోందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్‌ దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు.. డబ్బులను కూడా లాక్కుని పోయిన సందర్భాలు ఉన్నాయని సీపీ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రాత్రి 10 గంటల తర్వాత ఈ రకాల చోరీలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. రోజుకు మూడు నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయనీ.. అందుకే ఈ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామని సీపీ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

ఈ ముఠాలో సుడాన్‌కు చెందినవారు కూడా ఉన్నారని హైదరాబాద్ సీపీ వెల్లడించారు. ఐదుగురు సుడాన్‌ జాతీయులు కాగా.. మరో 12 మంది నిందితులు హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించామన్నారు. స్నాచింగ్‌ చేసిన మొబైల్‌ ఫోన్లను అమ్మకానికి, రిసీవింగ్‌కు జగదీశ్‌ మార్కెట్‌ను కేరాఫ్‌ అడ్డాగా మార్చుకుని చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. ఇక కొన్ని మొబైల్‌ ఫోన్స్‌ విడి విభాగాలను కూడా ఇదే మార్కెట్‌లో అమ్ముతున్నారని హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కాగా.. 703 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామనీ.. వీటి విలువ రూ.1.75 కోట్ల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. సుడాన్‌కు చెందిన ఐదుగురు అక్రమంగా హైదరాబాద్‌లో ఉంటున్నారనీ తేలిందనీ.. ఈ ముఠాపై ఆయా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

Next Story