వాకింగ్‌కు వెళ్లిన జడ్జి.. యాక్సిడెంట్ కాదు హ‌త్యే.. వీడియో

CCTV footage of Dhanbad judge's road accident emerges.ఉద‌యాన్నే జాగింగ్‌కు వెళ్లిన ఓ జ‌డ్జిని ఆటోతో గుద్ది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2021 7:00 AM GMT
వాకింగ్‌కు వెళ్లిన జడ్జి.. యాక్సిడెంట్ కాదు హ‌త్యే.. వీడియో

ఉద‌యాన్నే జాగింగ్‌కు వెళ్లిన ఓ జ‌డ్జిని ఆటోతో గుద్ది హ‌త్య చేశారు. ఈ అమానుష ఘ‌ట‌న జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌లో బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. తొలుత దీనిని ప్ర‌మాదంగా బావించగా.. సీసీటీవీ పుటేజ్ ప‌రిశీలించ‌గా ఇది హ‌త్యేన‌ని తేలింది. వివ‌రాల్లోకి వెళితే.. ధన్‌బాద్‌‌లో అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఎడిజే ఉత్తం ఆనంద్ ప్ర‌తిరోజు లాగానే.. బుధవారం ఉద‌యం వాకింగ్‌కు వెళ్లారు. ఆయన మేజిస్ట్రేట్ కాలనీ సమీపంలోని రణధీర్ వర్మ చౌక్ వద్దకు చేరుకోగానే ఒక ఆటో వెనుక నుంచి వచ్చి ఆయనను టార్గెట్‌గా చేసుకొని ఢీకొట్టింది. ఇంటి నుంచి అర కిలోమీట‌ర్‌లోపే ఉత్త‌మ్ ఆనంద్‌ను ఆ వాహ‌నం ఢీకొట్టింది.

చాలాసేప‌టి వ‌ర‌కూ ర‌క్తం మ‌డుగులో ఆయ‌న అలా రోడ్డుమీదే ప‌డి ఉన్న త‌ర్వాత ఓ వ్య‌క్తి గ‌మ‌నించి హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ కొద్దిసేప‌టికే మృతి చెందారు. తొలుత దీనిని ప్ర‌మాదంగానే అంతా బావించారు. అయితే.. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డ్రైవ‌ర్ కావాల‌నే జ‌డ్జి వైపు వెళ్లి ఢీకొట్టిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది.

కాగా.. జడ్జిని ఢీకొట్టిన ఆటో దొంగిలించబడినదిగా పోలీసులు గుర్తించారు. ఆ ఆటో పతార్దిహ్ నివాసి అయిన సుగ్ని దేవి పేరిట రిజిస్టర్ చేయబడిందని పోలీసులు తెలిపారు. ఆటో యజమానిని విచారించగా.. తమ ఆటో గత రాత్రి దొంగిలించబడిందని.. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఈ సంఘటన జరిగిందని సుగ్ని చెప్పారు. ఆటో యజమాని ఫిర్యాదుతో ధన్‌బాద్ పోలీసులు మరింత లోతుగా ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తున్నారు. గ‌తంలో జడ్జి ఆనంద్ విచార‌ణ జ‌రిపిన కేసుల‌పై దృష్టి సారించారు. ఆయ‌న ధ‌న్‌బాద్‌లో ఎన్నో మాఫియా హ‌త్య‌ల కేసుల‌ను చూస్తున్నారు. ఈ మ‌ధ్యే ఇద్ద‌రు గ్యాంగ్‌స్ట‌ర్‌ల‌కు బెయిల్ కూడా నిరాక‌రించారు.

'బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఒక ఆటో జడ్జిని వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ ఆటోను ఇంకా పట్టుకోలేదు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు' అని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ తెలిపారు.

ఈ హ‌త్య‌ను సీరియ‌స్‌గా తీసుకున్న చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ ర‌మ‌ణ‌.. జార్ఖండ్ హైకోర్టు జ‌డ్జితో మాట్లాడారు. ఈ కేసును హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ తీసుకున్నారు. ఈ కేసు గురించి మాకు తెలుసు. మేము చూసుకుంటాం అని ఆయ‌న అన్నారు.

Next Story
Share it