విషాదం.. 11 నెలల చిన్నారిపై కారు దూసుకెళ్లడంతో..
Car runs over toddler at Hyderabad.ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా 11 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
By తోట వంశీ కుమార్ Published on 28 April 2021 6:10 AM GMTపొట్టకూటి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన ఓ జంటకు కడుపుకోత మిగిలింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా 11 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఎనమదల గ్రామంలో తోట రమేష్, అనూష దంపతులు నివసిస్తుండేవారు. వీరికి ఇద్దరు కుమారైలతో పాటు 11 నెలల జశ్వంత్ అనే కుమారుడు ఉన్నాడు. వీరు బ్రతుకు దెరువు కోసం కొద్ది నెలల క్రిందట హైదరాబాద్ నగరానికి వచ్చారు.
కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ బి బ్లాక్‌లో నివాసం ఉంటూ ఉపాధి పనులు చేసుకుంటున్నారు. మంగళవారం ఆ దంపతులు ఇద్దరూ ఇంటి పనుల్లో బిజీగా ఉన్నారు. జశ్వంత్.. తన ఇద్దరు అక్కలతో కలిసి పక్కంటి చిన్నారులతో కలిసి రోడ్డు మీద ఆడుకుంటున్నాడు. అదే సమయంలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తాటి కిరణ్ అనే వ్యక్తి తన హ్యుందాయ్ ఐ 20 కారులో ఆఫీసుకు వెలుతున్నాడు. మూలమలుపు వద్ద చిన్నారులు ఉండగా.. హారన్ కొట్టాడు. దీంతో చిన్నారులంతా రోడ్డు పక్కకు వెళ్లిపోగా.. 11 నెలల చిన్నారి జశ్వంత్ మాత్రం నడవలేక పాకుతూ ఆ పిల్లల వైపు వెలుతున్నాడు.
అతడిని చూసుకోని కిరణ్.. కారును ముందుకు పోనిచ్చాడు. కారు ముందు టైరు జశ్వంత్ పై నుంచి వెళ్లింది. దీంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆ బాలుడిని కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతన్ని స్కానింగ్ కోసం కొత్తగూడలోని టెస్లా ఆస్నత్రికి తీసుకెళ్లి.. కొండాపూర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే.. అప్పటికే బాలుడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.