వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు ఓ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో ఈ ఘటన జరిగింది. వరంగల్ నుంచి కారు పర్వతగిరికి వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి.. ఎస్సారెస్పీ కెనాల్‌లో పడిపోయింది. కారు కాలువలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే కాలువలోకి దిగి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. డ్రైవర్‌కు ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.
ఈ ఘటనలో కారులో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తితో పాటు వెనుకాల కూర్చున్న సరస్వతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుతో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో కారు నీటిలో కొద్ది దూరం కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కారును కాలువలోంచి బయలకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు సరస్వతి గుంటూరుపల్లె పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. మరో వ్యక్తి వ్యాపారి శ్రీధర్‌గా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.