దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి చంపి..

బీహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో ఐదేళ్ల బాలుడిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపిన కేసులో...

By -  అంజి
Published on : 13 April 2026 7:39 AM IST

Jehanabad Murder Case, Private School Hostel Incident, Rape and Murder, Special Investigation Team (SIT), Canteen Guard Arrest

దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి చంపి.. 

బీహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో ఐదేళ్ల బాలుడిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపిన కేసులో ఒక ప్రైవేట్ పాఠశాల క్యాంటీన్ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 6, సోమవారం నాడు కరౌనా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్‌లో ఈ అమానుష ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం పాట్నాకు తరలించగా, అక్కడ వైద్యులు బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారు.

ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సీనియర్ పోలీసు అధికారి అప్రాజిత్ లోహన్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. దర్యాప్తులో భాగంగా తొలుత హాస్టల్ నిర్వాహకుడు తరుణ్ కుమార్‌ను విచారించి జైలుకు పంపారు. అయితే, లోతైన విచారణలో హాస్టల్ క్యాంటీన్ గార్డ్ ముఖేష్ కుమార్ అలియాస్ సుదామా ప్రవర్తనపై అనుమానం కలగడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోస్ట్‌మార్టం నివేదికలో బాలుడిపై హత్యకు ముందు లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది.

నిందితుడు తన భార్య తనను వదిలి వెళ్ళిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నానని, అలాగే హాస్టల్ నిర్వాహకుడితో ఉన్న విభేదాల కారణంగా పాఠశాలను బద్నాం చేసి మూయించాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తెలిపాడు. సీసీటీవీ దృశ్యాలు కూడా నిందితుడిపై ఉన్న అనుమానాలను బలపరిచాయి. ఈ కేసులో నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా 'స్పీడీ ట్రయల్' నిర్వహిస్తామని ఎస్పీ అప్రాజిత్ లోహన్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

Next Story