దొంగతనం చేశారని.. కూతుళ్లను రాత్రంతా తలకిందులుగా వేలాడదీసిన తండ్రి.. ఒకరు మృతి

దొంగతనం చేశారనే అనుమానంతో కన్నతండ్రే కాలయముడిగా మారి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను చిత్రహింసలకు గురిచేసిన అమానవీయ ఘటన...

By -  అంజి
Published on : 28 March 2026 7:22 AM IST

Child Abuse Case, Father Arrested for Murder, Domestic Violence, Brutal Torture, Theft Suspicion Punishment, Mumbai Crime News, Child Safety

దొంగతనం చేశారని.. కూతుళ్లను రాత్రంతా తలకిందులుగా వేలాడదీసిన తండ్రి.. ఒకరు మృతి

దొంగతనం చేశారనే అనుమానంతో కన్నతండ్రే కాలయముడిగా మారి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను చిత్రహింసలకు గురిచేసిన అమానవీయ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ పాశవిక దాడిలో పదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా, మరో బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని దాదు హైబత్ యంగర్‌గా పోలీసులు గుర్తించారు. పొరుగువారు ఆ ఇద్దరు బాలికలపై దొంగతనం అనుమానం వ్యక్తం చేయడంతో, ఆగ్రహానికి గురైన తండ్రి బుధవారం సాయంత్రం వారిని ఇనుప యాంగిల్‌కు తలకిందులుగా వేలాడదీసి క్రూరంగా శిక్షించాడు.

10 ఏళ్ల సానిక, 11 ఏళ్ల అనుజల కాళ్లు, చేతులు కట్టేసిన తండ్రి.. వారిని ఇంటిలో తలకిందులుగా వేలాడదీశాడు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఆ చిన్నారులు నరకయాతన అనుభవించారు. దాహం వేసి మంచి నీళ్లు అడిగినా కనికరించకుండా వారిని అలాగే వదిలేశాడు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వారి తాత ఆ పిల్లలను చూసి కట్లు విప్పాడు. అప్పటికే సానిక ప్రాణాలు విడవగా, అనుజ స్పృహ కోల్పోయి పడి ఉంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, స్పృహలోకి వచ్చిన తర్వాత తండ్రి చేసిన క్రూరత్వాన్ని వైద్యులకు వివరించింది.

సానిక మరణించిన తర్వాత, ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు అత్యంత రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే గాయపడిన అనుజ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అసలు నిజం బయటపడింది. అంతేకాకుండా, పిల్లలను విడిపించినందుకు గాను నిందితుడు తన తండ్రి (పిల్లల తాత) పై కూడా పదునైన ఆయుధంతో దాడి చేసి ప్రాణాపాయ బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు.

Next Story