పెళ్లైన రెండు రోజులకే.. వరుడి ఆత్మహత్య
Bridegroom committed suicide in Khammam.ఖమ్మం జిల్లాలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే నవ
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2022 12:01 PM ISTఖమ్మం జిల్లాలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే నవ వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యవరం గ్రామానికి చెందిన నరేష్(29)కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా ఆర్లపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చమైంది. ఈ నెల 4న ఇద్దరికి వివాహం జరిపించారు. తరువాతి రోజు నరేష్ స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించారు. పెళ్లి, రిసెప్షన్‌లో ఎంతో ఆనందంగా కనిపించాడు నరేష్. తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు.
సోమవారం అందరూ కలిసి విజయవాడ సమీపంలోని గుణదల దైవదర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అద్దెకు కారును మాట్లాడాడు నరేష్. సోమవారం తెల్లవారుజామునే నిద్ర లేచిన నరేష్.. అందరిని లేపాడు. తాను స్నానం చేసి వస్తానంటూ బాత్రూమ్‌కు వెళ్లగా.. మిగతా వారు ప్రయాణ ఏర్పాట్లలో మునిగిపోయారు.
ప్రయాణ సమయం దగ్గర పడుతున్నప్పటికీ నరేష్ ఎక్కడా కనిపించలేదు. దీంతో అతడికి పలుమార్లు ఫోన్ చేసిన స్పందించలేదు. చివరికి బాత్రూమ్ గది తలుపు పగల కొట్టి లోపలికి వెళ్లగా.. అక్కడ రక్తపు మడుగులో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహామైన రెండు రోజులకే నరేష్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్నది మిస్టరీగా మారింది.