విషాదం.. కుమారుడి కారుణ్య మ‌ర‌ణం కోసం కోర్టుకు.. ఇంత‌లో

Boy died on the court premises.తోటి చిన్నారుల‌తో ఆడుతూ పాడుతూ హాయిగా ఉండాల్సిన వ‌య‌సు ఆ చిన్నారిది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2021 1:36 AM GMT
విషాదం.. కుమారుడి కారుణ్య మ‌ర‌ణం కోసం కోర్టుకు.. ఇంత‌లో

తోటి చిన్నారుల‌తో ఆడుతూ పాడుతూ హాయిగా ఉండాల్సిన వ‌య‌సు ఆ చిన్నారిది. అయితే.. నాలుగేళ్లుగా అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. కొడుకు ప‌డుతున్న బాధ‌ను చూడ‌లేక ఆ క‌న్న‌త‌ల్లి హృద‌యం త‌ల్ల‌డిల్లింది. కొడుకును ఆ బాధ నుంచి త‌ప్పించేందుకు ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్మేసింది. అయిన‌ప్ప‌టికి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. చివ‌రికి క‌డుపు తీసి చంపుకుని కుమారుడి కారుణ్య మ‌ర‌ణానికి అనుమ‌తివ్వాల‌ని కోర్టును కోరేందుకు వ‌చ్చింది. అయితే.. కోర్టుకు సెల‌వు కావ‌డంతో వెన‌క్కి వెలుతుండ‌గా.. దారిలోనే కుమారుడు క‌న్నుమూయ‌డంతో ఆ త‌ల్లి వేద‌న మిన్నంటింది. ఈ విషాద ఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

గుర్రంకొండ మండలం గేరికుంటపల్లెకు చెందిన మణి, చౌడేపల్లె మండలం బీర్జేపల్లెకు చెందిన అరుణను వివాహం చేసుకుని బీర్జేపల్లెలో స్థిరపడ్డాడు. వీరికి ఇద్ద‌రు సంతానం. నాలుగేళ్ల కింద‌ట పెద్ద కుమారుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ (9) పాఠ‌శాల‌లో ఆడుకుంటూ ప‌డిపోయాడు. నోటినుంచి, ముక్కు నుంచి ర‌క్త‌స్రావం జ‌రిగింది. అప్ప‌టి నుంచి త‌ర‌చూ అలాగే జ‌రుగుతోంది. అరుదైన ర‌క్త సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ని ఈ నాలుగేళ్ల‌లో వివిధ ఆస్ప‌త్రుల్లో చూపించారు. ఇందుకోసం గుర్రంకొండలో ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్మేసారు. మ‌రోవైపు కుమారుడి బాధ‌ను చూడ‌లేక తండ్రి మ‌ణి 15 రోజుల క్రితం ఇల్లు వ‌దిలి వెళ్లిపోయాడు.

అనారోగ్యంతో బిడ్డ పడుతున్న వేదనను చూసి తట్టుకోలేకపోయిన అరుణ.. అతడికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరాలని నిర్ణయించుకుంది. కుటుంబసభ్యులతో కలిసి కొడుకును తీసుకుని ఆటోలో మంగళవారం పుంగనూరు కోర్టుకు వచ్చింది. కోర్టుకు సెలవని తెలియడంతో వారంతా అదే ఆటోలో వెనుదిరిగారు. బీర్జేపల్లె వెళ్లకముందే ఆటోలోనే హర్షవర్ధన్‌ తుదిశ్వాస విడిచాడు. కళ్లముందే కన్నపేగు తెగిపోవడంతో ఆ తల్లి రోదన మిన్నంటింది.

Next Story