బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్‌ రాజ్‌ దారుణ హత్య

బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంక‌జ్‌రాజ్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

By Srikanth Gundamalla  Published on  21 Aug 2024 3:29 AM GMT
bihar, gun fire, rjd leader, pankaj roy, murder,

బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్‌ రాజ్‌ దారుణ హత్య 

బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంక‌జ్‌రాజ్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. హాజీపుర్‌లో ఉన్న పంకజ్‌రాజ్‌ తన ఇంటి వద్ద కూర్చున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. పంకజ్ దగ్గరకు వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. వారిని గమనించిన వెంట‌నే ఆయ‌న ఇంట్లోకి ప‌రిగెత్తినా దుండగులు వెన‌క్కి త‌గ్గ‌కుండా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో పంక‌జ్‌రాజ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నితీశ్‌, ఎన్‌డీఏ ప్ర‌భుత్వంపై ఆయ‌న‌ విమ‌ర్శ‌లు గుప్పించారు.

స్థానిక కౌన్సిలర్ పంకజ్ రాయ్ మంగళవారం సాయంత్రం బీహార్‌లోని హాజీపూర్‌లోని తన నివాసానికి సమీపంలోని బట్టల దుకాణంలో ఉన్నారు. మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతని పక్కనే వచ్చి అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. తనను తాను రక్షించుకోవడానికి అతని ఇంట్లోకి పరిగెత్తాడు. అయితే, దుండగులు బైక్‌ దిగి మరీ లోపలికి ప్రవేశించారు. కాల్పుల శబ్దం విన్న అతని కుటుంబ సభ్యులు, స్థానికులు అలర్ట్ అయ్యారు. వెంటనే పంకజ్‌ రాయ్ వద్దకు వెళ్లారు. అప్పటికే బుల్లెట్ గాయాలతో ఉన్న పంకజ్‌ను.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే పంకజ్ చనిపోయాడని వైద్యులు చెప్పారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎన్‌డీఏ విఫలమయ్యాయని ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఆరోపించారు. "హాజీపూర్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని NDA గూండాలు రాత్రి వేళ హాజీపూర్‌లో వార్డు కౌన్సిలర్ పంకజ్ రాయ్‌ను కాల్చి చంపారు. ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రుల గూండాలు అల్లకల్లోలం సృష్టిస్తుంటే వారు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు" అని తేజస్వీ యాదవ్ అన్నారు.


హత్యానంతరం ఎస్పీ హర్ కిషోర్ రాయ్ సహా సీనియర్ పోలీసు అధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. వివరాలను సేకరించారు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించామని, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు పోలీసులు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Next Story