Telangana: హాస్టల్‌లో ఇద్దరు టెన్త్ విద్యార్థినుల ఆత్మహత్య కలకలం
భువనగిరిలోని బాలికల హాస్టల్‌లో టెన్త్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల మృతి సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 6:27 AM GMTTelangana: హాస్టల్‌లో ఇద్దరు టెన్త్ విద్యార్థినుల ఆత్మహత్య కలకలం
భువనగిరిలోని బాలికల హాస్టల్‌లో ఉంటూ బీచ్ మహల్లా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల మృతి సంచలనంగా మారింది. తాము ఉంటోన్న హాస్టల్లోనే విద్యార్థినులు ఉరివేసుకుని కనిపించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. చనిపోయిన ఇద్దరు విద్యార్థినులు హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య, వైష్ణవిగా పోలీసులు చెప్పారు. ఈ మేరకు వారు చనిపోయిన చోట ఒక సూసైడ్ లెటర్ కూడా దొరికింది.
ఏ తప్పు చేయలేదు అనీ.. అయినా తమకు అందరూ మాటలు అంటుంటే తట్టుకోలేకపోతున్నామని రాసి ఉంచారు. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేకపోతున్నామని రాశారు. శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మట్లేదని.. అందుకే వెళ్లిపోతున్నాం.. క్షమించండి అంటూ సూసైడ్ లెటర్‌లో రాసి పెట్టింది ఉంది. అంతేకు తామిద్దరినీ ఒకేచోట సమాధి చేయాలని రాశారు. శనివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
కాగా.. శనివారం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం హాస్టల్‌కు తిరిగి వచ్చారు. హాస్టల్‌లో నిర్వహించే ట్యూషన్‌కు వెళ్లకుండా రూమ్‌లోనే ఉన్నారు. రాత్రి భోజనం చేశాక వస్తామని ట్యూషన్ టీచర్‌కు చెప్పారు. కానీ.. వారు భోజనానికి కూడా రాలేదనీ.. దాంతో అనుమానంతో వెళ్లి చూడగా గదిలోని రెండు ఫ్యాన్లకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారని హాస్టల్ విద్యార్థులు చెప్పారు. దాంతో.. వారిని వెంటనే కిందకు దించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే చనిపోయారని వైద్యులు చెప్పారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు హాస్టల్‌కు వెళ్లారు. గదిలో సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేశామనీ.. హాస్టర్ వార్డెన్ శైలజ, ట్యూషన్ టీచర్లను విచారిస్తున్నట్లు చెప్పారు.
అయితే.. హాస్టల్‌లో విద్యార్థినుల మధ్య గొడవ జరిగిందనీ.. దాని వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని డీఈవో చెబుతున్నారు. ఈ విద్యార్థినులు ఇద్దరు తమకు దూషించారని.. చేయికూడా చేసుకున్నారనీ నలుగురు విద్యార్థినులు స్కూల్‌లో టీచర్‌కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. టీచర్ వారిని మందలించడం.. ఫిర్యాదు చేశారనే అవమానంతో విద్యార్థినులు సూసైడ్ చేసుకుని ఉంటారని డీఈవో అన్నారు.
అయితే.. విద్యార్థినుల తల్లిదండ్రులు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. తమ పిల్లలది ఆత్మహత్య కాదనీ.. హత్యే అని అంటున్నారు. పిల్లలు రాశారని చెబుతున్న సూసైడ్ నోట్ వారి హ్యాండ్ రైటింగ్ కాదని అంటున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బంధువులతో కలిసి ఆందోళన చేయడంతో హాస్టల్ వద్ద ఉద్రిక్తత కనిపించింది. దాంతో.. పోలీసులు రంగంలోకి దిగి అక్కడ భద్రత ఏర్పాటు చేశారు.