బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన చెల్లెలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తి తన బావమరిదినే అతిక్రూరంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, మృతదేహాన్ని తన కారులోనే ఉంచుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. బైరప్పనహళ్లికి చెందిన శ్రీనివాస్ అనే 30 ఏళ్ల వ్యక్తికి ఒక డాగ్ కెన్నెల్ (కుక్కల పెంపక కేంద్రం) ఉంది. ఈ వారంలోనే అతను బన్నెరఘట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
హత్యకు గురైన వ్యక్తి 24 ఏళ్ల రంజిత్. ఇతను నిందితుడు శ్రీనివాస్ భార్యకు తమ్ముడు. అయితే, ఇప్పటికే పెళ్లయిన శ్రీనివాస్ చిన్న చెల్లెలితో రంజిత్ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించుకుందాం రమ్మని నమ్మించి, రంజిత్‌ను బన్నెరఘట్ట సమీపంలోని ఒక ప్రాంతానికి శ్రీనివాస్ పిలిపించాడు. అక్కడ చర్చ జరుగుతుండగానే, శ్రీనివాస్ ఒక్కసారిగా ఇనుప రాడ్డుతో రంజిత్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హత్య చేసిన అనంతరం, శ్రీనివాస్ మృతదేహాన్ని తన కారులో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులకు అసలు విషయం చెప్పి లొంగిపోయాడు. పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన బెంగళూరులో తీవ్ర సంచలనం సృష్టించింది.