జూదానికి బానిసైన బ్యాంక్‌ ఉద్యోగి.. లాకర్‌కు కన్నం.. 2.7 కిలోల బంగారం ఎత్తుకెళ్లాడు

నమ్మకానికి మారుపేరుగా ఉండాల్సిన బ్యాంకులోనే కస్టమర్ల సొత్తుకు రెక్కలొచ్చాయి. బెంగళూరులోని ఒక ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో...

By -  అంజి
Published on : 16 Feb 2026 8:40 AM IST

Bank Gold Theft Bengaluru, Assistant Manager Arrested, Indian Bank Gold Scam, Online Betting Gambling, Gold Recovery Investigation

జూదానికి బానిసైన బ్యాంక్‌ ఉద్యోగి.. లాకర్‌కు కన్నం.. 2.7 కిలోల బంగారం ఎత్తుకెళ్లాడు

నమ్మకానికి మారుపేరుగా ఉండాల్సిన బ్యాంకులోనే కస్టమర్ల సొత్తుకు రెక్కలొచ్చాయి. బెంగళూరులోని ఒక ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ (34), తన పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా 2.7 కిలోల బంగారాన్ని కాజేశాడు. దాదాపు రూ. 4 కోట్ల విలువైన ఈ బంగారాన్ని ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జూదానికి ఖర్చు చేయడం గమనార్హం. నిందితుడు కిరణ్ కుమార్ ప్లాన్ ప్రకారం.. బ్రాంచ్ మేనేజర్ లేని సమయంలో లాకర్ల తాళాలను తన వద్ద ఉంచుకునేవాడు.

కస్టమర్లు తాకట్టు పెట్టిన (Pledged Gold) నగలను తనిఖీ చేసే నెపంతో, కొద్దికొద్దిగా బంగారాన్ని దొంగిలించడం మొదలుపెట్టాడు. ఇలా 21 ప్యాకెట్ల నుంచి కొంత మేర, మరో 3 ప్యాకెట్ల నుంచి పూర్తిగా బంగారాన్ని మాయం చేశాడు. జనవరి 2న కొంతమంది కస్టమర్లు తమ బంగారాన్ని విడిపించుకోవడానికి బ్యాంకుకు వచ్చినప్పుడు అసలు విషయం బయటపడింది. లాకర్లను వెరిఫై చేయగా, నగలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులు లోతైన తనిఖీ చేపట్టగా, మొత్తం 2,783 గ్రాముల బంగారం మాయమైనట్లు తేలింది.

బ్యాంకు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకోగా, అతను తన నేరాన్ని అంగీకరించాడు. దొంగిలించిన బంగారాన్ని వివిధ ఫైనాన్స్ షాపుల్లో తాకట్టు పెట్టి, ఆ డబ్బును ఆన్‌లైన్ జూదంలో పోగొట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు 1.2 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. మిగిలిన బంగారం కోసం దర్యాప్తు కొనసాగుతోంది. సహకరించని ఫైనాన్సియర్లపై కోర్టు ద్వారా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ముఖ్య గమనిక: బ్యాంకు లాకర్లలోని వస్తువులను కస్టమర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని, తమ విలువైన వస్తువుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story