ఇటీవల చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సమస్య ఏదైనా దాన్ని ధైర్యంగా ఎదిరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వారు ప్రాణాలు వదిలేస్తే.. వారిని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటనే దాని గురించైనా కనీసం ఆలోచించకుండా వారిని బాధపెడుతున్నారు. తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె డైరీని చూడగా.. పని ఒత్తిడి కారణంగానే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు రాసి ఉంది. ఆమె మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు తల్లి లేని పిల్లలుగా మారారు. ఈ విషాద ఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గతేడాది సెప్టెంబర్‌లో ప్రమోషన్‌పై త్రిస్సుర్ నుంచి కొతుపరంబాలోని తొక్కిలంగడి బ్యాంకుకు మేనేజర్‌గా వచ్చింది స్వప్న(38). అయితే.. శుక్రవారం యథావిధిగా ఓ మహిళా ఉద్యోగి ఉదయం 9 గంటలకు బ్యాంకుకు వచ్చింది. బ్యాంకులో పనిచేస్తుండగా.. మేనేజర్ రూమ్‌లో స్వప్న ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించింది. వెంటనే పెద్దగా అరవడంతో బ్యాంకులో పనిచేసే వారు వెంటనే స్వప్న గదిలోకి వచ్చారు. ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే.. స్వప్న అప్పటికే మరణించినట్లు వారు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని.. అందువల్లే ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నానని రాసి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. స్వప్నకు 15,13 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు.