Adilabad: బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. ఆ బాధను బయటకు చెప్పుకోలేక..
బ్యాంక్‌లో పని భారం ఎక్కువగా ఉందని తనలో తానే మదన పడుతూ ఓ బ్యాంక్ మేనేజర్ పురుగు మందు తాగి తనువు చాలించాడు.
By అంజి Published on 21 Aug 2023 8:09 AM ISTAdilabad: బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. ఆ బాధను బయటకు చెప్పుకోలేక..
అతడు బ్యాంకు మేనేజర్.. తన ఫ్యామిలీతో జీవితం సాఫీగా సాగిపోతోంది. అయితే కొన్ని రోజుల నుంచి బ్యాంక్‌లో పని భారం ఎక్కువ అయ్యింది. ఇద్దరు చేయాల్సిన పనిని తానొక్కడినే చేస్తున్నాడు. ఈ విషయాన్ని తన భార్యతో పలు సార్లు పంచుకున్నా ఆ బాధ తీరలేదు. తనలోని బాధను ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే మదనపడ్డాడు. ఈ క్రమంలోనే చివరకు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ బ్యాంక్ మేనేజర్.. తన కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వాంకిడి ఎస్సై సాగర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాంకిడి మండలంలోని ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో విధులు నిర్వర్తిస్తున్న బానోతు సురేష్(35) ఈ నెల 17వ తేదీన డ్యూటీ పూర్తయ్యాక.. రాత్రి 7.30 గంటల సమయంలో కార్యాలయంలోనే ముందుగా తెచ్చుకున్న పురుగుమందు తాగారు. దీంతో అతడు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టాడు.
ఇది గమనించిన బ్యాంకు సిబ్బంది ఏమైందని అతడిని అడిగితే ఒంట్లో బాగాలేదని సమాధానమిచ్చారు. ఆ వెంటనే సిబ్బంది ఆసిఫాబాద్‌లో ఉంటున్న భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అతడిని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు మంచిర్యాలకు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం సురేష్ మృతి చెందాడు. బ్యాంకులో పనిభారం ఎక్కువగా ఉండేదని పలు మార్లు భార్య ప్రియాంకతో చెబుతుండే వాడని, పని ఒత్తిడి కారణంగానే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి తండ్రి లక్ష్మీరాజం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.