భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
భార్య సహా ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla
భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
క్షణికావేశంలో కొందరు ఏం చేస్తారో తెలియదు. అలాంటి సమయంలోనే దారుణాలకు పాల్పడుతుంటారు. వారి ప్రాణాలు తీసుకోవడం లేదంటే.. ఎదుటి వ్యక్తులను చంపడమో.. గాయపర్చడమో చేస్తుంటారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జూలైలోనే ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
కర్ణాటకలోని సీగేనహళ్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో వీరాంజనేయ (31), అతడి భార్య హేమావతి (29) ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు. పిల్లల్లో ఒకరి వయసు ఏడాదిన్నర కాగా.. మరో చిన్నారికి ఎనిమిది నెలల వయసు. భార్య, పిల్లలను హత్య చేసి వీరాంజనేయ కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 31న ఈ సంఘటన జరిగింది. అయితే.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు డోర్‌ను బలవంతంగా తెరిచి చూశాడు. అప్పటికే పడకపై భార్య, ఇద్దరు పిల్లలు, ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయిన వీరాంజనేయను చూశారు. ఇక వెంటనే కాడుగోడి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నాలుగు మృతదేహాలను మార్చురీకి తరలించారు. అపార్ట్‌మెంట్‌లో దొరికిన ఆధారాల ప్రకారం మృతులు హైదరాబాద్ వాసులని పోలీసులు తెలిపారు. కాగా.. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని చెబుతున్నారు. దంపతుల మధ్య గొడవ జరిగి ఉంటుందని.. ఆవేశంలో భర్త ముగ్గురినీ చంపీ.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే అన్ని వివరాలు చెబుతామన్నారు పోలీసులు.