మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన మొక్కజొన్న గింజలు
మొక్కజొన్న గింజలు తింటూ మూడేళ్ల చిన్నారి మరణించింది.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 12:59 PM ISTతల్లిదండ్రులతో కలిసి మూడేళ్ల చిన్నారి మొక్కజొన్న గింజలు తింటూ సందడి చేస్తోంది. చిన్నారిని అల్లరిని చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అయితే.. సడెన్‌గా చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురైంది. ఊపిరితిత్తుల్లోకి గింజలు చేరడంతో శ్వాస ఆడక విలవిలలాడుతూ కన్నుమూసింది. ఈ ఘటన భదాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
చుంచుపల్లి మండలంలోని రాంపురం గ్రామంలో వెంకట కృష్ణ, అశ్విని దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో కలిసి నివసిస్తున్నారు. బుధవారం పెద్ద కుమార్తె బిందుశ్రీ ఇంట్లో మొక్కజొన్నగింజలు తింటుండగా పొల మారింది. విపరీతంగా దగ్గు రావడంతో పాటు వాంతులు చేసుకుంది. శ్వాస ఆడక బిందుశ్రీ ఇబ్బంది పడింది.
వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాప ఊపిరితిత్తుల్తో మొక్కజొన్న గింజలు ఉన్నాయని గుర్తించారు. బ్రాంకోస్కోప్ చేయాలని, ఇక్కడ సరైన వసతులు లేవని వరంగల్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. ఓ వైపు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగానే బిందుశ్రీ ప్రాణాలు కోల్పోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారిని ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.