యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ భార్య‌కు ప్ర‌స‌వం.. ఏం జ‌రిగిందంటే..?

Baby dies in YouTube assisted delivery at home.ఇటీవ‌ల కాలంలో యూట్యూబ్ వీడియోలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 7:48 AM IST
యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ భార్య‌కు ప్ర‌స‌వం.. ఏం జ‌రిగిందంటే..?

ఇటీవ‌ల కాలంలో యూట్యూబ్ వీడియోలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. యూట్యూబ్ వీడియోలు చూస్తూనే చాలా మంది వంట‌లు చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదేమో. అయితే.. అన్నింటికి ఇలా చేయ‌డం క‌రెక్టు కాదు. ఎవ‌రు చేయాల్సిన పని వారే చేయాలి. అంతేకాని ఒక‌రు చేయాల్సిన ప‌ని ఇంకొరు చేస్తే ఫ‌లితం బెడిసికొట్ట‌డం ఖాయం. త‌మిళ‌నాడుకు చెందిన ఓ వ్య‌క్తి యూట్యూబ్ వీడియోల సాయంతో భార్య‌కు ఇంట్లోనే డెలివ‌రీ చేశాడు. ఫ‌లితంగా మృత శిశువుకు జ‌న్మ‌నిచ్చిన ఆమె.. తీవ్ర ర‌క్త‌స్రావంతో ప్ర‌స్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్ప‌త్రిలో ఉంది. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాణిపేట్ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేరకు.. పాన‌ప‌క్కం గ్రామంలో లోక‌నాథ‌న్‌(32), గోమ‌తి(28) దంప‌తులు నివ‌సిస్తున్నారు. లోక‌నాథ‌న్ స్థానికంగా ఓ దుకాణం న‌డుపుతున్నాడు. వీరిద్ద‌రికి ఏడాది క్రితం వివాహమైంది. ఈ నెల 18న ఆమెకు పురిణి నొప్పులు వ‌చ్చాయి. అయితే.. ఆస్ప‌త్రికి తీసుకెళ్లకుండా లోక‌నాథ‌న్ త‌న సోద‌రి జ్యోతి సాయంతో ఇంట్లోనే ఆమెకి ప్ర‌వ‌సం చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. యూట్యూబ్‌లో డెలివ‌రీకి సంబంధించిన వీడియోలు చూస్తూ.. దాదాపు గంట సేపు ఇబ్బంది ప‌డి డెలివ‌రీ చేశారు.

ఈ క్ర‌మంలో ఆమె మృత శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. మ‌రో వైపు తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంట‌నే స్థానికి ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం గోమ‌తి ప‌రిస్థితి విషమంగా ఉండ‌డంతో వేలూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై జిల్లా వైద్యాధికారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కాగా.. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని, ఇంకా ఎవ‌రిపై కేసు న‌మోదు చేయ‌లేద‌ని తెలిపారు. ఇంట్లోనే ప్రసవం జరగాలన్నది గోమతి ఇష్టపూర్తిగా తీసుకున్న నిర్ణయమని, ఆస్పత్రికి పోదామని బతిమాలినా ఆమె వినిపించుకోలేదని కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించార‌న్నారు.

Next Story