జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు నెలలు నిండని మగ శిశువును వదిలేసి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బావిలో పసికందును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నవజాత శిశువును విడిచిపెట్టి, శిశువు మరణానికి కారణమైన వారి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని పట్టుకుంటామని ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు. కాగా, ఈ అమానవీయ చర్యకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.