వాళ్లువీళ్లు అని తేడా లేకుండా అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమారై హర్షిత కేజ్రీవాల్‌ను బురిడీ కొట్టించారు. ఆమె అకౌంట్లోంచి ఏకంగా రూ.34 వేలు కొట్టేశారు. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ ఓఎల్‌ఎక్స్ లో సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మడానికి ప్రయత్నించగా ఆమెకు కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. హర్షిత ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓఎల్ఎక్స్‌లో హర్షిత ఓ సోఫాను అమ్మకానికి పెట్టారు. ఆమె ఇచ్చిన వివరాలు చూసిన ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. డీల్ కుదుర్చుకున్నాడు. డబ్బులు పంపిస్తానని చెప్పి ఓ బార్ కోడ్‌ను స్కాన్ చేయమని ఓ లింక్‌ను పంపించాడు. ఆమెను నమ్మించడం కోసం కొంత మొత్తాన్ని పంపించాడు. హర్షిత అతడు పంపిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగా.. అతడి నుంచి డబ్బులు రాకపోగా.. ఆమె అకౌంట్ నుంచి రూ.20వేలు మాయమయ్యాయి. వెంటనే హర్షిత అతడిని సంప్రదించగా.. పొరపాటున వేరే క్యూఆర్ కోడ్ ను పంపానని.. మరో కోడ్ ను పంపి దాన్ని స్కాన్ చేస్తే ఈ సారి మొత్తం డబ్బులు వస్తాయని నమ్మించాడు. మరోసారి హర్షిత అలాగే చేయడంతో.. ఈ సారి రూ.14వేలు దోచేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన హర్షిత వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.