హైదరాబాద్‌లో కానిస్టేబుల్ దారుణ హత్య

హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిలుకానగర్‌లో ఓ ఏఆర్‌ (AR) కానిస్టేబుల్‌ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.

By -  అంజి
Published on : 16 March 2026 7:42 AM IST

Hyderabad AR Constable Murder, Uppal Police Station Crime News, Chilukanagar Murder Case, Constable Sudheer Killing, WhatsApp Chat Dispute Murder

హైదరాబాద్‌లో కానిస్టేబుల్ దారుణ హత్య 

హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిలుకానగర్‌లో ఓ ఏఆర్‌ (AR) కానిస్టేబుల్‌ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి తన పాత స్నేహితుడే కత్తితో దాడి చేయడంతో ఈ ఘోరం జరిగింది. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన సుధీర్‌ (35). ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ వింగ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ, చెంగిచర్లలోని ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నారు. సుధీర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకానగర్‌లో ఉండే ఆటోడ్రైవర్‌ సంతోష్‌నాయక్‌తో సుధీర్‌కు పాత పరిచయం ఉంది. అయితే శనివారం రాత్రి వీరిద్దరి మధ్య వాట్సప్‌లో జరిగిన చాటింగ్ వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడంతో మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి చిలుకానగర్‌ ఆదర్శనగర్‌లోని ఒక ఖాళీ స్థలం వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సుధీర్ తన స్నేహితుడు ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి అక్కడికి చేరుకోగా, అప్పటికే సిద్ధంగా ఉన్న సంతోష్‌నాయక్ కత్తితో సుధీర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణభయంతో సుధీర్, ఇమ్రాన్ పరుగులు తీసినప్పటికీ, తీవ్ర గాయాలైన సుధీర్ సాయిబాబా ఆలయ సమీపంలో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా చాటింగ్‌ వల్లే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story