ఏపీకి చెందిన ఆ ఇద్దరూ అమెరికాలో ఉద్యోగం చేస్తుండడంతో.. వారిద్దరికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఆరు నెలల క్రితం వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 3న వివాహాం చేసేందుకు ముహూర్తం ఖారారు చేసి ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. అయితే.. వివాహానికి పది రోజులు ముందు యువతి, యువకుడు మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అతడు చెప్పాడు. పెద్దలు ఇద్దరికి నచ్చజెప్పారు. అన్ని సర్దుకుంటాయని బావించి పెద్దలు పెళ్లి పనులు మొదలెట్టారు. అయితే.. పెళ్లి సమయం దగ్గర పడుతున్నా.. అతడు పెళ్లికి ససేమీరా అనడంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి లోనై ప్రాణాలు తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు నగరం పోలీసు కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ(24) అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతూ ఉద్యోగం చేస్తోంది. పూతలపట్టు మండలం వడ్డేపల్లె పంచాయతీ బందార్లపల్లెకు చెందిన మురళి కుమారుడు భరత్ టెక్సాస్‌లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ అక్కడే ఉండడంతో.. ఇరు కుటుంబాలు వారికి పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 3వ తేదీ ఉదయం 3 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పత్రికలు కూడా ముద్రించి పంచిపెట్టారు. అయితే.. పది రోజుల క్రితం వారిద్దరి మధ్య విబేదాలు వచ్చాయి.
దీంతో భరత్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ జరిగింది. కొద్ది రోజుల్లో అన్ని సర్దుకుంటాయని బావించిన పెద్దలు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికి భరత్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో సుష్మ తీవ్ర మనస్థాపానికి లోనై అమెరికాలో తాను ఉంటున్న గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. సుష్మ బంధువులు చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు.