నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో మ‌రో మ‌లుపు

Another turn in Tirupati woman frauds case.నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసు మ‌రో మలుపు తిరిగింది. సుహాసిని మొద‌టి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2021 3:00 AM GMT
నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసులో మ‌రో మ‌లుపు

నిత్య పెళ్లికూతురు సుహాసిని కేసు మ‌రో మలుపు తిరిగింది. సుహాసిని మొద‌టి భ‌ర్త స‌హ‌కారంతోనే ఇలా మోసాల‌కు పాల్ప‌డుతోంద‌ని తెలిసింది. సుహాసిని వ‌ల్ల తాను న‌ష్ట‌పోయానంటూ ఆమె రెండో భ‌ర్త విన‌య్ మీడియా ముందుకు వ‌చ్చారు. మూడో భ‌ర్త‌కు చెప్పిన‌ట్లుగానే త‌న‌కు కూడా అనాథ‌గానే ప‌రిచ‌యమై వివాహం చేసుకున్న‌ట్లు తెలిపాడు. త‌న నుంచి వివిధ రూపాల్లో రూ.15లక్ష‌లు దోచుకుంద‌ని ఆరోపించాడు.

తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన వినయ్ తెలిపిన వివరాల మేర‌కు.. నాకు 2018లో సుహాసిని ప‌రిచ‌యం అయ్యింది. అనాథ అనిచెప్పింది. నేనంటే ఇష్టం అని పెళ్లి చేసుకుందామ‌నే ప్రతిపాద‌న పెట్టింది. 2019లో ఆమెను వివాహం చేసుకున్నా. మా కుటుంబ స‌భ్యుల‌తో మంచిగా న‌టించి ప‌లువురి నుంచి రూ.10 ల‌క్ష‌లు తీసుకుంది. రెండు నెల‌ల తరువాత ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. అంత‌కు ముందే సుహాసిని త‌న మేన‌మామ‌ అంటూ నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన మొద‌టి భ‌ర్త‌ని నాకు పరిచ‌యం చేసింది. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌నే మేన‌త్త పిల్ల‌ల‌ని న‌మ్మించింది.

ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం రావ‌డంతో వివ‌రాలు ఆరా తీయ‌గా.. నాకు మేన‌మామ‌గా ప‌రిచ‌యం చేసిన వ్య‌క్తే సుహాసిని భ‌ర్త అని.. ఆ పిల్ల‌లు వారికే పుట్టిన‌ట్లు తెలిసింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా స్పందించ‌లేదు. ఆ మ‌రుస‌టి రోజే ఆమె మా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ స‌మ‌యంలో సుమారు రూ.5ల‌క్ష‌ల విలువ చేసే బంగారం తీసుకెళ్లింది. మ‌రోసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా పట్టించుకోకపోవడంతో ఆమె మోసాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పాడు. తిరుపతిలో మూడో పెళ్లి విషయం వెలుగులోకి రావడంతో మీడియా ముందుకు వచ్చానని వినయ్‌ తెలిపాడు.

వెలుగులోకి వ‌చ్చింది ఇలా..

అలిపిరి ఎస్‌ఐ పరమేశ్‌నాయక్‌ కథనం మేరకు.. చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలానికి చెందిన యువకుడు (29) ఐదేళ్లుగా మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తూ తిరుపతి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేసే ఎం.సుహాసిని (35)తో అతనికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుహాసిని అనాథనని చెప్పడంతో యువకుడు కుటుంబ సభ్యులను ఒప్పించి గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే యువతికి 8 తులాల బంగారు నగలు పెట్టారు. 'నన్ను చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి ఆరోగ్యం సరిగా లేదు. పెళ్లికి ముందు అప్పులు చేశాను' అంటూ ఆమె యువకుడి నుంచి రూ.4 లక్షలు, అతని తండ్రి నుంచి మరో రూ.2 లక్షలు తీసుకుంది.

ఇది తెలిసి యువకుడు ఈ నెల 7న ఆమెను నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం ప్రయత్నించగా, ఇంట్లో యువతి ఆధార్‌కార్డు లభించింది. దాని ఆధారంగా ఆరా తీయగా.. నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. ఈలోగా సుహాసిని ఆ యువకుడికి ఫోన్‌ చేసింది. 'నేను హైదరాబాద్‌లో ఉన్నా.. త్వరలో నీ డబ్బులిచ్చేస్తా. పోలీసులను ఆశ్రయిస్తే ఇబ్బంది పడతావు' అని హెచ్చరించింది. ఏడాదిన్నర కిందట రెండో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఫొటోలనూ యువకుడికి పంపింది. దీంతో బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ నిత్య‌పెళ్లికూతురు బండారం బ‌య‌ట‌ప‌డింది.


Next Story