నాలుగోసారి ఫెయిల్ అవుతాననే భయంతో.. నీట్ విద్యార్థి ఆత్మహత్య
Another 20 Year Old NEET Aspirant Kills Self.ఇటీవల యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
By తోట వంశీ కుమార్ Published on 31 Oct 2021 11:14 AM GMTఇటీవల యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితం ఎంత విలువైందో తెలుసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో, ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందనో, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదనే కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. నీట్ పరీక్ష ఫలితాలు వెలువడముందే అందులో ఉత్తీర్ణత సాధించలేనేమోనని ఆందోళనతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్ జిల్లా కినాతుకడవులో కీర్తి వాసన్(20) అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు సార్లు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నాలుగో సారి నీట్ పరీక్ష రాశాడు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. పరీక్ష రాసిన తరువాత నుంచి పరీక్షల్లో ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని తల్లిదండ్రులతో చెబుతూ వాపోయాడు. పరీక్షా ఫలితాలు వచ్చే వరకు వేచిచూడమని తల్లిదండ్రులు అతడికి నచ్చచెప్పారు. అయినప్పటికి తాను ఖచ్చితంగా పరీక్ష పాస్ కాలేనేమోనని దిగాలుగా ఉండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు పొల్లాచి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెలుతుండగా.. మార్గ మధ్యంలో మరణించాడు.
నీట్ పరీక్ష కారణంగా ఈ ఏడాది తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు 5గురు చనిపోయారు. కాగా.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం ఈ పరీక్షను రద్దు చేయడానికి సపోర్టు కోరుతూ.. 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. నీట్ లాంటి పోటీ పరీక్షలను ఎదుర్కోలేక మానసిక ఆందోళన చెందుతున్న వారికోసం ఇప్పటికే ప్రత్యేక హెల్ప్‌లైన్ ని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.