రోజు రోజుకు మానవ సంబంధాలు చచ్చిపోతున్నాయి. తన మన అనే తేడా లేకుండా అమ్మాయిలు కనిపిస్తే చాలు చిదిమేస్తున్నారు కామాంధులు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేర్ డివిజన్‌లోని పెద్దపంజాని మండలంలోని ఒక మారుమూల గ్రామంలో శుక్రవారం (జనవరి 2, 2026) రాత్రి దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పలమనేర్ పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మద్యం మత్తులో ఉన్న నిందితుడు మైనర్ బాలికను ఇంటి నుంచి బయటకు లాగి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆమెపై దాడి చేశాడు. బాలిక అమ్మమ్మ జోక్యం చేసుకుని దాడిని ఆపడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమెపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు నిందితుడి మొదటి భార్య కుమార్తె అని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, బాలికను చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.