ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత, రూ.8.40 కోట్లు సీజ్
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున నగదును సీజ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 9:19 AM IST
ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత, రూ.8.40 కోట్లు సీజ్
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు, మద్యం, బంగారం సహా ఇతర ఉచితాలు సరఫరా చేయకూడదనే ఉద్దేశంతో పటిష్టంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు చోట్ల భారీగా నగదు, మద్యంతో పాటు ఇతర వస్తువులను సీజ్ చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున నగదును సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో మరింత పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు. ఎక్కడా ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశారు. లారీలో తరలిస్తోన్న రూ.8.40 కోట్ల నగదును సీజ్ చేశారు. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో దాన్ని సీజ్ చేశారు. అలాగే అక్రమంగా డబ్బు తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీలో నగదును గుర్తించామన్నారు. మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు ఈ లారీ వెళ్తున్నట్లు ఇన్‌వాయిస్ ద్వారా గుర్తించామన్నారు. లారీ క్యాబిన్‌లోని ఖాళీ ప్లేస్‌ను ఏర్పాటు చేసి ఐదు కవర్లు ఉన్న పెద్ద అట్ట డబ్బాలను గుర్తించామని చెప్పారు. ఆ అట్టపెట్టల్లోనే డబ్బును గుర్తించామన్నారు. ఇక పట్టుబడ్డ నగుదుని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద భారీగా డబ్బు పట్టివేత
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 9, 2024
ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీలు, లారీలో తరలిస్తోన్న రూ.8.40 కోట్లు సీజ్, ఇద్దరు అరెస్ట్ pic.twitter.com/IOFY98W3de