మిస్టరీగానే అనంతపురం అమ్మాయిల బలవన్మరణం
Ananthapuram girls Mysterious death in Kadapa.అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు సోమవారం కడప
By తోట వంశీ కుమార్ Published on 2 Feb 2022 9:08 AM ISTఅనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు సోమవారం కడప జిల్లాలో రైలు పట్టాలపై పడి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే.. వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. ఇక ఈ ఇద్దరు అమ్మాయిలు ప్రాణ స్నేహితురాలు అన్న విషయం ఇరు కుటుంబాల్లో తెలియకపోవడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యాడికి మండలం కమలపాడు గ్రామానికి చెందిన కల్యాణి (18) బీటెక్ చదువుతోంది. యాడికి పట్టణంలోని హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రిలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. వీరిద్దరూ వేములపాడు మోడల్ స్కూలులో ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారు. కాగా.. విద్యాదీవెన పథకానికి సంబంధించిన పని ఉందని కల్యాణి తాడిపత్రి నుంచి సొంతూరైన యాడికి మండలం కమలపాడు సచివాలయానికి వెలుతున్నానని చెప్పి బయలుదేరింది. పూజిత కళాశాలకు వెలుతున్నానని చెప్పి వచ్చింది.
వీరిద్దరూ సోమవారం ఉదయం 9.42 గంటలకు తాడిపత్రిలో బస్సు ఎక్కి కడపలో దిగారు. కడప బస్టాండ్ లో దిగిన తరువాత ఇద్దరూ ఆనందంగా సెల్పీలు దిగారు. మద్యాహ్నాం 1.30 సమయంలో కడప రైల్వే స్టేషన్‌లో తిరిగినట్లు సీసీటీవీ పుటేజ్‌ల ద్వారా తెలిసింది. రాజంపేట వైపు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా.. అక్కడ పని చేస్తోన్న సిబ్బంది ఇటు రాకూడదని చెప్పడంలో వాళ్లు మళ్లీ రోడ్డు మీదికొచ్చి ఆటోలో భాకరాపేట (ఎర్రముక్కపల్లె) రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు.
ఇద్దరూ పట్టాలపై నడుచుకుంటూ వస్తుండగా.. అది చూసిన గూడ్స్ రైలు డ్రైవర్ వేగాన్ని తగ్గించాడు. దీంతో వారు పట్టాలు దిగారు. అయితే.. రైలు వారి సమీపంలోకి రాగానే ఇద్దరూ ఒక్కసారిగా పట్టాపై పడ్డారు. ఈ ఘటనలో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పూజిత మృతి చెందింది. బిడ్డల మృతదేహాలు చూసి రెండు కుటుంబాల వారు బోరున విలపించారు. వీరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు అనే అంశం మిస్టరీగా మారింది.
కాగా.. వీరిద్దరు ప్రాణ స్నేహితులు అనే విషయం చనిపోయేంత వరకు తమకు తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇద్దరికి ఇంటి వద్ద ఎలాంటి సమస్యలు లేవు. చదువుల్లో కూడా రాణిస్తున్నారు. ఇక ప్రేమ వ్యవహారాలు కూడా లేనట్లు తెలుస్తోంది. అయితే.. వీరు కడపకు ఎందుకు వచ్చారు..? అన్నది తెలియాల్సి ఉంది. వీరిద్దరి ఫోన్ కాల్ డేటా వివరాలు తెలిస్తే.. ఆత్మహత్యల మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.