ఓ ట్రక్కును అంబులెన్స్ ఢీ కొనడంతో ఏడుగురు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పిల్భిత్‌కు చెందిన ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు హెల్త్ చెకప్ కోసం ఢిల్లీ వెళ్లి తిరిగి వస్తుండగా మంగళవారం ఉదయం బరేలీ జిల్లాలోని ఫతేగంజ్ ప్రాంతంలో అంబులెన్స్ అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఢీ కొట్టింది. అనంతరం ఎదురుగా వస్తున్నట్రక్కును ఢీ కొంది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు వాహనంలోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలలు, నలుగురు పురుషులు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు బరేలీ ఎస్‌ఎస్పీ రోహిత్ సింగ్ సజ్వాన్ తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.