మదనపల్లె ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు.. నాలుక కోసి తినేసింది
After Alekhya murder mother Padmaja ate her tongue. చిత్తూరు జిల్లా మదనపల్లెలో కుమార్తెలను హత్యచేసిన ఘటనలో
By తోట వంశీ కుమార్
చిత్తూరు జిల్లా మదనపల్లెలో కుమార్తెలను హత్యచేసిన ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో కుమార్తెలను డంబెల్‌తో కొట్టి చంపేసింది తల్లి పద్మజ. తరువాత పెద్ద కుమార్తె అలేఖ్య (27) నాలుకను కోసి తినేసిందని ఆమె భర్త పురుషోత్తం నాయుడు చెప్పినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక.. ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాను పూర్వజన్మలో అర్జునుడినని ఆలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం డాక్టర్లకు చెప్పారు. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని.. కరోనానే ఇందుకు ఓ సూచిక అని చెబుతుండేదని.. తాను చదివిన పుస్తకాల్లో ఇటువంటి విషయాలే ఉండడంతో.. ఆమె చెప్పిన మాటలు నమ్మానని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం.
పద్మజ, పురుషోత్తం దంపతులు ఇద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, వీరికి సుమారు నాలుగు గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు రుయా మానసిక వైద్యనిపుణులు చెప్పారు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారని.. విపరీతమైన దైవ చింతనతోనే వారు ఈ సమస్య బారినపడ్డారన్నారు. స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక లక్షణాలు వీరిలో ఉన్నాయని.. వీరిని మరింత కౌనెల్సింగ్ అవసరం కావడంతో విశాఖ మానసిక వైద్యశాలకు రెఫర్ చేసినట్లు చెప్పారు.
తన బిడ్డలు తిరిగి వస్తున్నారని, వెంటనే ఇంటికి వెళ్లాలని చెబుతున్న పద్మజ.. జైలులో తనకు తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య కనిపించడం లేదని వైద్యులకు చెబుతోంది. ఇక పద్మజ సన్నిహితులకు మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. పద్మజ తండ్రి కూడా 20ఏళ్లుగా మానసిక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిసింది. పద్మజ మేనమామ కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డారని, వంశపారంపర్యంగా పద్మజకు.. ఆమె కుమారై అలేఖ్యకు ఇది సంక్రమించి ఉండొచ్చునని మానసిక వైద్యులు భావిస్తున్నారు.