నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసిన నటి ప్రత్యూష అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By - అంజి |
నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసిన నటి ప్రత్యూష అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వచ్చే నాలుగు వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ధర్మాసనం అతడిని ఆదేశించింది.
2002 ఫిబ్రవరిలో నటి ప్రత్యూష తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇద్దరూ తాగారని, చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడని కథనాలు వచ్చాయి. అయితే, ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఇది ఆత్మహత్య కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని, తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ న్యాయపోరాటం ప్రారంభించారు. తొలుత ఈ కేసును విచారించిన కింది కోర్టు, సిద్ధార్థ రెడ్డికి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గానూ శిక్ష విధించింది.
ఆ తర్వాత జరిగిన సుదీర్ఘ విచారణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. సిద్ధార్థ రెడ్డిని దోషిగా నిర్ధారించి, అతనికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను నిర్దోషినని, ఆ శిక్షను రద్దు చేయాలని కోరాడు. తాజాగా సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది. నిందితుడి వాదనల్లో బలం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. నాలుగు వారాల గడువు ఇచ్చి, ఆ లోపు కోర్టు ముందు లొంగిపోయి శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీ దేవి స్పందిస్తూ.. "న్యాయం జరగడానికి చాలా సమయం పట్టింది. నా కుమార్తె మరణానికి కారణమైన వారికి శిక్ష పడాలని నేను ఇన్నేళ్లుగా పోరాటం చేశాను" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో గత 24 ఏళ్లుగా నలుగుతున్న ప్రత్యూష మృతి కేసు ఒక కొలిక్కి వచ్చినట్లయింది.