Hyderabad: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 1:26 PM ISTHyderabad: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన పలువురి హృదయాలను కదిలించివేసింది.
స్కూల్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా గతంలోనూ ప్రమాదాలు జరిగాయి. స్కూల్ బస్సులు విద్యార్థుల ఇంటింటికి వెళ్లాలి.. కాబట్టి గల్లిల్లో తిరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న గల్లీల్లో ఇంటి ముందు ఆడుకుంటూ ఉండే చిన్నారు బస్సు చక్రాల కింద పడిపోతారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు హైదరాబాద్‌లో జరిగాయి. తాజాగా జవహర్ నగర్‌లో చోటుచేసుకుంది. ఆనంద్ నగర్ ఎక్స్‌సర్వీస్ మెయిన్ కాలనీలో ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
ఇదే కాలనీలో నివాసం ఉంటున్న ఓ బాలుడు ప్రయివేట్ స్కూల్‌లో చదువుతున్నారు. శనివారం స్కూల్ కు వెళ్తున్న సమయంలో సోదరుడికి తోడుగా స్కూల్ బస్సు వద్దకు వచ్చింది మూడేళ్ల చిన్నారి భవిష్య. ఆ చిన్నారి తన అన్నకు నవ్వుతూ టాటా బాయ్ బాయ్ చెప్పింది. ఇంతలోనే బస్సు ముందుకు వెళ్తుండగా ఆ చిన్నారి ప్రమాద వశాత్తు బస్సు ముందు చక్రాల కింద పడిపోయింది. దాంతో..ఆ చిన్నారి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించింది. అది గమనించిన స్థానికులు బస్సు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యం కారణంగానే భవిష్య మృతి చెందిందని మండిపడుతూ.. డ్రైవర్ ప్రవీణ్ పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇక ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. సోదరుడిని స్కూలుకు పంపించడానికి వెళ్లిన చిన్నారి తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.