ప్రభుత్వ ఆఫీసును లూటీ చేసిన ఫ్యూన్.. చివరికి తలుఫులు కూడా వదల్లేదు

A security guard who sold all his belongings in a government office for alcohol. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. తాను పని చేస్తున్న ఆఫీసుకే కన్నం పెట్టాడు. తాను పని చేస్తున్న ఆఫీసులోని

By అంజి  Published on  27 Sept 2022 11:27 AM IST
ప్రభుత్వ ఆఫీసును లూటీ చేసిన ఫ్యూన్.. చివరికి తలుఫులు కూడా వదల్లేదు

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. తాను పని చేస్తున్న ఆఫీసుకే కన్నం పెట్టాడు. తాను పని చేస్తున్న ఆఫీసులోని వస్తువులన్నింటినీ అమ్మి.. వచ్చిన డబ్బుతో మద్యం తాగుతూ జల్సాలు చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజామ్‌ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగింది. ప్రభుత్వ కార్యాలయానికి సెక్యూరిటీగా ఉండాలని బాధ్యత అప్పజెప్పితే.. తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. గడిచిన రెండేళ్లలో కార్యాలయంలోని తలుపులతో సహా మొత్తం ఊడ్చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండేళ్ల కిందట గంజామ్‌ జిల్లాలోని డీఈవో కార్యాలయాన్ని వేరే బిల్డింగ్‌లోకి మార్చారు. ఆ సమయంలో అవసరమైన సామగ్రిని మాత్రమే కొత్త ఆఫీసుకు తీసుకెళ్లారు.

కొన్ని ఫైల్స్​తో పాటు ఫర్నీచర్​ను పాత ఆఫీస్​లోనే ఉంచారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌కు సెక్యూరిటీగా ఉండాలని ప్యూన్‌ పీతాంబర్‌కు బాధ్యతలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆ ఆఫీసు వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఇదే అదునుగా భావించాడు పీతాంబర్. ఆఫీసులో ఉన్న వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్ముతూ వచ్చాడు. పాత ఫైళ్లు, బల్లలు, 10 సెట్ల కుర్చీలు, 20కిపైగా అల్మరాలను అమ్మేశాడు. చివరికి కిటికీలను సైతం వదలలేదు. పోలీస్‌ స్టేషన్‌కు అడుగు దూరంలో ఉన్న విద్యాశాఖ కార్యాలయంలో ఈ దొంగతనం జరిగింది.

గంజామ్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరూ అటువైపు రాకపోవడం వల్ల పీతాంబర్​కు మరింత ధైర్యం పెరిగింది. ఇదే సరైన సమయంగా భావించి తలుపులతో సహా అన్నింటినీ మద్యం కోసం అమ్మేశాడు. చివరకు ఓ రోజు సెక్షన్​ ఆఫీసర్​ జయంత్​ కుమార్​ సాహూ కొన్ని ఫైల్స్​ కోసం పాత ఆఫీస్​కు వచ్చారు. ఆఫీసు మొత్తం ఖాళీగా కనిపించడంతో ఆఫీసర్‌ ఆశ్చర్యపోయాడు. కార్యాలయంలో చోరీ జరిగిందని అనుమానించి వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు సెక్యూరిటీ పీతాంబరాన్ని అదుపులోని తమదైన శైలిలో విచారించారు. విచారణలో తానే ఈ దొంగతనం చేసినట్లు పీతాంబరం ఒప్పుకున్నాడు. మద్యం తాగేందుకు డబ్బుల కోసమే ఇదంతా చేసినట్లు చెప్పాడు.

Next Story