వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. కూతురిని కడతేర్చిన తల్లి
కుషాయిగూడలో ఓ చిన్నారి బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొత్త కోణం కనిపించింది.
By అంజి Published on 12 July 2023 6:36 AM IST
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. కూతురిని కడతేర్చిన తల్లి
వివాహేతర సంబంధం అన్నిటికీ అడ్డమే.. సాఫీగా సాగిపోతున్న సంసారంలోకి మూడో వ్యక్తి ఎంటర్ కావడంతో ఆ కుటుంబంలో కలహాలు రేగడమే కాకుండా ఆ కుటుంబంలో ఎవరో ఒకరు హత్యకు గురి అవుతున్న ఘటనలు ఎన్నో. దంపతులలో ఎవరో ఒకరు వివాహేతర సంబంధానికి పాల్పడటం ఫలితంగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారంటూ భర్తను, పిల్లలను హత్య చేసిన ఘటనలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివాహేతర సంబంధానికి అడ్డం వస్తోందని నాలుగేళ్ల కూతురు తన్వితను తల్లి కళ్యాణి అతి దారుణంగా హత్య చేసింది. కళ్యాణి భర్త ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న మరో యువకుడితో కళ్యాణి వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే తన వివాహేతర సంబంధానికి కూతురు అడ్డంగా ఉందని భావించిన తల్లి కళ్యాణి తన కూతుర్ని ఎలాగైనా సరే హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 1న కుమార్తెను తల్లి కళ్యాణి హత్య చేసింది. కూతురు మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేయడమే కాకుండా నిద్రలో తన కూతురు చనిపోయినట్లుగా ప్రచారం చేసింది.
తల్లి కళ్యాణి సూపర్‌గా పెర్ఫార్మెన్స్ చేసి స్థానికులను సైతం నమ్మించేసింది. స్థానికులు బంధువులు కళ్యాణి చెప్పింది నిజమని నమ్మారు. అనుమానం వచ్చి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. అయితే పోలీసులకు మొదటి నుండి తల్లి కళ్యాణి కదలికలపై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు కళ్యాణిపై నిఘా పెట్టారు. పోలీసుల దర్యాప్తులో తల్లి కళ్యాణి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు కళ్యాణిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.