బీఫ్ తినమని భార్య బలవంతం.. భర్త ఆత్మహత్య.. వెలుగులోకి సంచలన నిజాలు
A husband committed suicide after his wife threatened him to eat beef. గుజరాత్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, భార్య సోదరుడు బీఫ్ తినాలని బలవంతం చేయడం కారణంగా
By అంజి Published on 30 Aug 2022 6:28 AM GMTగుజరాత్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, భార్య సోదరుడు బీఫ్ తినాలని బలవంతం చేయడం కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరగగా.. బాధితుడు రోహిత్ ప్రతాప్ సింగ్ ఉరివేసుకునే ముందు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన సూసైడ్ నోట్ తాజాగా వెలుగు చూసింది. భార్య, భార్య సోదరుడి కారణంగానే భర్త సూసైడ్ చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో భార్య, భార్య సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రోహిత్ ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్న రెండు నెలల తర్వాత ఫేస్‌బుక్ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. దీంతో సూసైడ్ నోట్ కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. బీఫ్ మాంసం తినడానికి నిరాకరించడంతో వారు తనను బెదిరించారని మృతుడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ''నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. నా చావుకి కారణం నా భార్య సోనమ్ అలీ, ఆమె సోదరుడు అక్తర్ అలీ. నాకు న్యాయం చేయాలని నా స్నేహితులందరిని అభ్యర్థిస్తున్నాను. నన్ను చంపేస్తానని బెదిరించి బీఫ్ తినిపించారు. ఇక ఈ లోకంలో జీవించే అర్హత నాకు లేదు. అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నాను'' అని రోహిత్ ప్రతాప్ సింగ్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. రోహిత్ మృతి చెందిన రెండు నెలల తర్వాత సూసైడ్ నోట్ విషయం అతని బంధువులకు తెలిసింది. దీంతో వారు సూరత్ పోలీసులను సంప్రదించారు.
సోనమ్‌ని రోహిత్ ఎలా కలిశాడు
రోహిత్, సోనమ్ సూరత్‌లో కలిసి పనిచేసేవారు. అలా వారు ఒకరినొకరు కలుసుకున్నారు. తర్వాత ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే సోనమ్‌ది వేరే మతం కావడంతో రోహిత్ కుటుంబం వారి సంబంధానికి నిరాకరించింది. సోనమ్‌ని పెళ్లి చేసుకుంటే రోహిత్‌తో ఉన్న సంబంధాలన్నీ తెంచుకుంటామని కుటుంబ సభ్యులు బెదిరించారు. అయినా.. రోహిత్, సోనమ్‌ని పెళ్లి చేసుకుని, ఆమెతో కలిసి జీవించడం ప్రారంభించాడు. గత ఏడాది కాలంగా కుటుంబ సభ్యులతో టచ్‌లో లేడు.
న్యాయం చేయాలని డిమాండ్
రోహిత్ ఉరివేసుకునే ముందు ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పోస్ట్ చేసినట్లు బంధువులు వెల్లడించడంతో రోహిత్ తల్లి.. సోనమ్, ఆమె సోదరుడు అక్తర్ అలీపై ఫిర్యాదు చేసింది. తన కుమారుడి మృతికి కారకులైన వారిని శిక్షించాలని బాధితురాలి తల్లి వీణాదేవి డిమాండ్ చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఉధ్నా పోలీస్ స్టేషన్ సోనమ్, ఆమె సోదరుడు అక్తర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సూరత్ పోలీస్ ఏసీపీ జెటి సోనారా తెలిపారు.