తమిళనాడులో దారుణం.. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బట్టలపై రక్తపు మరకలతో ఏడుస్తూ..
తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో శనివారం ఏడేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
By - అంజి |
తమిళనాడులో దారుణం.. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బట్టలపై రక్తపు మరకలతో ఏడుస్తూ..
తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో శనివారం ఏడేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మణికంఠన్ (24) అనే భవన నిర్మాణ కార్మికుడు అపహరించి, లైంగిక దాడికి పాల్పడి ఒక వంతెన సమీపంలో వదిలేశాడు. రక్తపు మరకలతో ఏడుస్తున్న బాలికను గమనించిన బాటసారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి చికిత్స పొందుతోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. అయితే, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అధికార డిఎంకె (DMK) ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) స్పందిస్తూ.. స్టాలిన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, సామాన్యులకు రక్షణ కరువైందని విమర్శించారు. ఇలాంటి దారుణమైన పాలన పెట్టుకుని ప్రజలను ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పట్టపగలు, రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక చిన్నారిని అపహరించి దాడి చేసే ధైర్యం నేరస్తులకు వస్తోందంటే రాష్ట్రంలో చట్టం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. 2026 మే 10లోపు తమిళనాడులో 234 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మహిళలు మరియు చిన్నారుల భద్రత అంశం ఇప్పుడు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది.