భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న ఆమె జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. భార్యా, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త వదిలేశాడు. దీంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరింది. పిల్లలే ప్రాణంగా బ్రతుకుతోంది. అయితే.. ఓ ప్రమాద రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు.. ఇద్దరు పిల్లలతో పాటు తండ్రిని దూరం చేసింది. ఈ పరిమాణాలన్నింటిని చూసిన ఆమె తట్టుకోలేకపోయింది. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసింది.
వివరాల్లోకి వెళితే.. కాట్పాడి సమీపంలోని లత్తేరీ గ్రామంలో మోహన్ రెడ్డి(60) తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. బాణా సంచా దుకాణం నడుపుతున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారైలు ఉన్నారు. పెద్ద కుమారై విద్య(33)కు పదేళ్ల క్రితం నరేష్ అనే వ్యక్తితో వివాహాం చేశాడు. వారికి తేజశ్వరన్(8), ధూనూజ్ మోహన్(6) అనే పిల్లలున్నారు. కాగా.. కొంతకాలం పాటు వారి కాపురం సజావుగా సాగినా.. తరువాత విద్య, నరేష్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమెను భర్త వదిలివేశాడు. తన ఇద్దరు పిల్లలను తీసుకుని విద్య పుట్టింటికి వచ్చి ఉంటోంది.
అయితే.. ఈ నెల 18న మోహన్ రెడ్డి, మనమల్లు తేజేశ్వరన్, ధనూజ్‌మోహన్ బాణాసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భర్త వదిలివెళ్లడం, ప్రాణంగా చూసుకుంటున్న పిల్లలతో పాటు తండ్రి మృతి చెందడంతో జీవితంపై విరక్తి చెందిన విద్య బుధవారం తెల్లవారుజామున లత్తేరి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.