జగిత్యాలలో కలకలం.. చెరువులో దూకి ముగ్గురు యువతుల ఆత్మహత్య
3 Women Commit Suicide in Jagitial.ఏ కష్టం మొచ్చిందో తెలీదు కానీ ఒకేసారి ముగ్గురు మహిళలు చెరువులోకి దూకి ఆత్మహత్య
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2021 11:03 AM GMT
ఏ కష్టం మొచ్చిందో తెలీదు కానీ ఒకేసారి ముగ్గురు మహిళలు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ఇద్దరు వివాహితులు కాగా.. మరొకరు ఇంటర్ విద్యార్థిని కావడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన దేవి, మల్లిక, వందన అనే ముగ్గురు మహిళలు ఒకే వీధిలో నివసించేవారు. ఏం జరిగిందో తెలీదు కానీ.. నిన్న ఈ ముగ్గురు అదృశ్యమయ్యారు. గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో గల ధర్మసముద్రం చెరువులో ఈ రోజు రెండు మృతదేహాలు తేలియాడుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను నీటిలోంచి బయటకు తీయించారు. మృతులను దేవీ, మల్లికగా గుర్తించారు. దీంతో మూడో యువతి కూడా చెరువులో దూకి ఉంటుందని బావిస్తున్న పోలీసులు వందన మృతదేహాం కోసం గాలింపు చేపట్టారు. మృతురాళ్ల కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే సారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.