ఒకప్పటి వివాహేతర సంబంధమే ఇప్పుడు ముగ్గురు హత్యకు కారణమైంది..!
వివాహేతర సంబంధం కారణంగా తలెత్తిన వివాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 2 Nov 2024 2:39 AMవివాహేతర సంబంధం కారణంగా తలెత్తిన వివాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారని పోలీసులు శుక్రవారం తెలిపారు. దీపావళి రోజైన గురువారం రాత్రి 9 గంటల సమయంలో బి చిన్నయ్య (48), అతని తమ్ముడు బి రాజు (42), కుమారుడు బి రమేష్ (24)లను పొరుగు ఇంట్లో నివసిస్తున్న వారు కొట్టి చంపినట్లు అధికారి ఒకరు తెలిపారు. కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి రఘువీర్ విష్ణు మాట్లాడుతూ.. ఈ ముగ్గురిని బేబి (44), ఆమె భర్త నాగభూషణం, వారి పిల్లలు సుబ్రహ్మణ్యం, దొరబాబు, వినోద్‌లు హత్య చేశారని తెలిపారు.
“చిన్నయ్య, బేబీలకు అక్రమ సంబంధం ఉండేది. ఇది వారి కుటుంబాల మధ్య వివాదాలకు దారితీసింది. ఐదు సంవత్సరాల క్రితం కుటుంబాల మధ్య వివాద పరిష్కారం జరిగింది. ఒకరినొకరు కలవవద్దని హెచ్చరికలు చేశారు”అని విష్ణు పిటిఐకి చెప్పారు.
ఈ క్రమంలోనే వారు కలవడం లేదు. అయితే.. చిన్నయ్య గ్రామంలో బేబీ గురించి బహిరంగంగా దుర్భాషలాడడం.. చెడుగా మాట్లాడటం ప్రారంభించడంతో.. ఇది ఇటీవల మరో వివాదానికి దారితీసిందని.. ఫలితంగా చిన్నయ్యను అలాంటి కార్యకలాపాలను మానుకోవాలని బేబీ భర్త హెచ్చరించినట్లు విష్ణు చెప్పారు. అయితే.. గురువారం రాత్రి మద్యం మత్తులో ఉన్న చిన్నయ్య మళ్లీ బేబీ గురించి చెడుగా మాట్లాడాడని.. దీంతో అతని కుటుంబ సభ్యులు ఇనుప రాడ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. చిన్నయ్యను రక్షించేందుకు వచ్చిన చిన్నయ్య సోదరుడు రాజు, కుమారుడు రమేష్‌లను కూడా బేబీ కుటుంబ సభ్యులు వదల్లేదు. విచక్షణారహితంగా కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులు తాగిన మైకంలో ఉండటంతో ప్రతిఘటించలేకపోయారు. అయితే.. మృతులు తమపై దాడి చేశారనే భావన కలిగించేందుకు బేబీ, కుటుంబ సభ్యులు బాధితుల చేతుల్లో కొడవళ్లు ఉంచారని విష్ణు తెలిపారు. ఇంతలో, పోలీసులు బేబీ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులను పట్టుకున్నారు. వివిధ చట్టపరమైన సెక్షన్ల కింద వారిని అరెస్టు చేశారు. అనంతరం విచారణను కొనసాగిస్తున్నారు.