విషాదం.. గ్యాస్ లీకై ముగ్గురు సజీవదహనం
3 Died in Gas Leakage in Palwancha.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంటగ్యాస్ లీకై మంటలు
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2022 10:04 AM ISTభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంటగ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాల్వంచ పట్టణంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పాల్వంచ పట్టణంలోని తూర్పు బజార్‌లో మండిగ నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారైలు సాహిత్య(12), సాహితి సంతానం. కాగా.. రోజులాగానే ఆదివారం రాత్రి కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. సోమవారం వేకువజామున ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో దంపతులతో పాటు సాహిత్య సజీవదహనం కాగా.. మరో కుమారై సాహితికి తీవ్రగాయాలయ్యాయి.
స్థానికులు స్పందించి చిన్నారిని పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక శరీరం 80 మేర కాలిపోయిందని.. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని బావించినా.. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా తేలింది. ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ రామకృష్ణ కారులో కొన్ని కీలక పత్రాలు, బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. అప్పులు పెరిగిపోవడం, ఆన్‌లైన్ వ్యాపారంలో రూ.30 లక్షలకు పైగా నష్టం రావడంతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.