ఘోర ప్ర‌మాదం.. ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

3 Dead As Truck Runs Over Sleeping Migrant Labourers In Haryana's Jhajjar.వారంతా వ‌ల‌స‌కూలీలు. బ్ర‌తుకు తెరువు కోసం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2022 2:10 PM IST
ఘోర ప్ర‌మాదం.. ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

వారంతా వ‌ల‌స‌కూలీలు. బ్ర‌తుకు తెరువు కోసం ఊరుగాని ఊరు వ‌చ్చారు. ప‌ని చేసి అల‌సిపోయి విశాంత్రి తీసుకునేందుకు పుట్‌పాత్‌పై నిద్రించారు. అదే వారు చేసిన త‌ప్పుగా మారింది. నిద్ర‌లోనే వారి ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు కూలీలు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా. మ‌రో 11 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈఘ‌ట‌న హరియాణాలోని ఝాజ్జ‌ర్ జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. అశోద టోల్ ప్లాజా సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 18 మంది కూలీలు ఈ వంతెన నిర్మాణంలో ప‌నిచేస్తున్నారు. ఇందులో 14 మంది ప‌ని అనంత‌రం విరామం కోసం స‌మీపంలోని పుట్‌పాత్‌పై విశ్ర‌మించారు. అటుగా వెలుతున్న ఓ లారీ పుట్‌పాత్ పై ప‌డుకున్న కార్మికుల‌పై నుంచి దూసుకెళ్లింది. అనంత‌రం అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ప్ర‌మాదం అనంత‌రం లారీ డ్రైవ‌ర్ ప‌రారు అయ్యాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క్ష‌త‌గాత్రులు పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. లారీ డ్రైవ‌ర్ మ‌ద్యం తాగి వాహ‌నాన్ని న‌డిపి ఉండొచ్చున‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story