ఘోర రోడ్డు ప్రమాదం.. కార్య‌క‌ర్త‌లు మృతి.. సీఎం విచారం

3 Congress workers killed in road accident in Punjab’s Moga.పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షులుగా నవజ్యోత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2021 6:03 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. కార్య‌క‌ర్త‌లు మృతి.. సీఎం విచారం

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షులుగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రమాణస్వీకారం వేళ విషాదం చోటుచేసుకుంది. సిద్దూ ప్ర‌మాణ స్వీకారానికి వెలుతున్న బ‌స్సు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లతో పాటు మ‌రో ఇద్ద‌రు మొత్తం ఐదుగురు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో 50 మంది గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. మోగా ప‌ట్ట‌ణ శివారులో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో వెలుతున్న బ‌స్సును ఎదురుగా వ‌స్తున్న‌ పంజాబ్ ఆర్టీసీ బ‌స్సు ఢీకొట్టింది. ఆ స‌మ‌యంలో రెండు బ‌స్సులు వేగంగా ప్ర‌యాణిస్తున్నాయి. అంత వేగంగా ఢీ కొట్ట‌డంతో రెండు బ‌స్సుల‌లోని డ్రైవ‌ర్లు స్పాట్‌లోనే చ‌నిపోయారు. వీరితో పాటు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మరణించారు. దాదాపు 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రోడ్డు ప్రమాదంలో కార్యకర్తలు మరణించడంతో కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

'మోగా ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ముగ్గురు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చ‌నిపోవ‌డంతో పాటు చాలా మంది గాయ‌ప‌డ్డడం చాలా విచార‌కం. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్య సేవ‌ల‌ను అందించాల‌ని, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మొత్తం నివేదిక‌ను అంద‌జేయాల‌ని అధికారుల‌ను ఆదేశించాను' అని సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఈరోజు మధ్యాహ్నం పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్దూ బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకించినప్పటికీ.. నవజోత్ సింగ్ సిద్దూకే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను సోనియా గాంధీ అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఆయన్ను పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. సిద్దూతో పాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జులై 18న ఉత్తర్వులు వెలువరించారు.

Next Story
Share it