Hyderabad: మియాపూర్‌లో 27 కిలోల బంగారం పట్టివేత
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున బంగారం, వెండి పోలీసులు పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 2:15 PM ISTHyderabad: మియాపూర్‌లో 27 కిలోల బంగారం పట్టివేత
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున బంగారం, వెండి పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి పోలీసులు నగరంలో భారీ ఎత్తున వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మియాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో చిలుమూల అనిరుద్ (23), దివా శంకర్ దూబే, బలిరామ్ హక్కే మారుతీ ఈ ముగ్గురు ఒక ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఈ ముగ్గురిని తతనిఖీ చేశారు పోలీసులు. దాంతో.. ద్విచక్ర వాహనంలో పెద్ద ఎత్తున బంగారం కనిపించింది. ఆ తర్వాత పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 27.540 కిలోల బంగారం, 15.650 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు మియాపూర్ పోలీసులు. బషీర్‌బాగ్‌లోని ఓ నగల షాప్ నుండి బంగారం వెండి ఆభరణాలు తీసుకువెళ్తున్నట్లు వ్యక్తులు పేర్కొన్నారు. అయితే ఈ బంగారం, వెండి ఆభరణాలు తీసుకువెళ్తున్న ముగ్గురు వద్ద ఎటువంటి బిల్లులు కానీ, దానికి సంబంధించిన పత్రాలు కానీ, వివరాలు కానీ లేవు. దాంతో.. పోలీసులు 27 కిలోల పైచిలుకు బంగారంతో పాటు 15 కిలోల పైచిలుకు వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇక వాహన తనిఖీల్లో భాగంగా సోమవారం కూడా భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. 14 లక్షల రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. నగరంలో రోజురోజుకీ లక్షల కొద్ది నగదును, బంగారాన్ని పోలీసులు పట్టుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో నాయకులు వివిధ గిఫ్టులు, మద్యం డబ్బులు వివిధ రకాల రూపంలో ప్రజలకు ఇచ్చి వారిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నగదు బంగారం తరలిస్తున్నారు. కానీ పోలీసులు ప్రతి ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండడంతో పట్టుబడుతున్నారు.