ఆక్సిజన్ కొరతపై మాక్ డ్రిల్.. 22 మంది మృతి..!
22 Patients Die At Agra Hospital Allegedly During Oxygen Mock Drill.ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2021 9:52 AM ISTఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి చేసిన నిర్వాకం 22 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్ నిలిపివేయడంతో 22 మంది రోగులు మృతిచెందారు. ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్సిజన్ మాక్ డ్రిల్ పేరుతో ఆసుప్రతి యాజమాన్యం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లుగా సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. దీంతో ఆస్పత్రి వ్యవహారంపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.
ఆగ్రాలోని శ్రీ పరాస్ ఆస్పత్రికి డా.ఆరింజయ్ జైన్ యజమాని. కరోనా కారణంగా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఏప్రిల్ నెలలో ఆస్పత్రికి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. తగిన ఏర్పాటు చేయాల్సింది పోయి.. మాక్ డ్రిల్ తరహాలో ఆక్సిజన్ డ్రిల్ నిర్వహించింది. "ముఖ్యమంత్రికి చెప్పినా ఆక్సిజన్ దొరకదని అంటున్నారు.. కాబట్టి కోవిడ్ రోగులను డిశ్చార్జ్ చేయండి.. రోగుల కుటుంబాలకు కౌన్సిలింగ్ ప్రారంభించాం.. కొందరు తాము చెప్పింది వింటున్నారు.. కానీ, ఇంకొందరు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు.. మాక్ డ్రిల్‌కు నేను అంగీకరించాను.. ఎవరు చనిపోతారో, ఎవరు బతికి ఉంటారో తెలుసుకుంటాం.. ఉదయం 7 గంటలకు ఇది నిర్వహించాం. అనుకున్నట్టు ఐదు నిమిషాలు మాక్ డ్రిల్ చేపట్టాం.. ఈ విషయం ఎవరికీ తెలియదు.. మొత్తం 22 మంది రోగులు చనిపోతారని గ్రహించాం.. ఐదు నిమిషాల్లో వారంతా నీల రంగులోకి మారిపోవడం గమనించాం" అని పరాస్ ఆస్పత్రి యజమాని అరిన్‌జే జైన్ మాట్లాడిన ఓ వీడియో క్లిప్ బయటపడింది.
కాగా.. అదేరోజున ఆ ఆస్పత్రిలో నలుగురు రోగులు మృతిచెందినట్లు అధికారికంగా నమోదైంది. మరుసటి రోజు మరో ముగ్గురు మృతి చెందారు. అయితే.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 22 మంది మృతి చెందారనే ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. ఏప్రిల్ 26న పరాస్ ఆస్పత్రిలో తన తాత చనిపోయారని ఆగ్రాలోని జీవన్ మండి ప్రాంత నివాసి మయాంక్ చావ్లా తెలిపాడు. అదే రోజు ఎందరో ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
కాగా.. వీడియోలో ఉన్నది నా మాటలు కాదనీ..అరింజయ్ అంటున్నారు. పరిస్థితి విషమించిన వారిని గుర్తించామని వారికి మరింత మెరుగైన చికిత్స ఇవ్వటానికే మాక్ డ్రిల్ చేశామని అంటున్నారు. ఏప్రిల్ 26న నలుగురు, మర్నాడు మరో ముగ్గురు కరోనా పేషెంట్లు చనిపోయారని చెప్పిన ఆయన ఏప్రిల్ 26న 22 మంది చనిపోయారా? అని ప్రశ్నకు మాత్రం మరణాలపై కచ్చితమైన సంఖ్య తెలియదని మాట మార్చేశారు.
ఇదిలా ఉండగా, ఆగ్రా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ మాత్రం ఆ రోజున ఆక్సిజన్ కొరతతో ఎవ్వరూ చనిపోలేదని మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏదిఏమైనప్పటికీ దీనిపై విచారణ చేపడతామని అన్నారు.