పక్కింటి ఆంటీ చంపేస్తుందనే భయంతో.. 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య
11 Year old dies by suicide after argument with neighbor. ఇంటి ముందు చెత్త పారేస్తున్నారని పక్కంటి మహిళతో ఓ బాలిక తల్లి వాగ్వాదానికి దిగింది.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2021 10:07 AM ISTఇంటి ముందు చెత్త పారేస్తున్నారని పక్కంటి మహిళతో ఓ బాలిక తల్లి వాగ్వాదానికి దిగింది. చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన పక్కంటి మహిళ ఓ సందర్భంలో బాలిక ప్రాణాలు తీసేస్తానంటూ బెదిరించింది. దీంతో బాలిక భయపడిపోయింది. గొడవ ముగిసాక ఆ బాలిక తల్లి బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలిక.. ఎక్కడ పక్కింటి ఆంటీ తనను చంపేస్తుందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోగల మన్‌ఖర్దు ప్రాంతంలో మార్చి 6న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మన్‌ఖర్దు ప్రాంతంలో 11 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి నివసిస్తోంది. వారి ఇంటి ముందు పదే పదే పక్కంటి మహిళ చెత్త పారవేస్తోంది. దీంతో మార్చి 6న వారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నగా మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఈ క్రమంలో పక్కంటి మహిళ.. బాలికతో పాటు ఆమె తల్లిని కూడా అసభ్యపదజాలంతో దూషించింది. ఒకానొక సమయంలో బాలిక ప్రాణాలను తీసేస్తానంటే బెదిరించింది. దీంతో భయడిన ఆ బాలిక ఏడవడం ప్రారంభించింది. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి పంపిచారు.
గొడవ ముగిసాక బాలిక తల్లి తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లి గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పక్కంటి మహిళ బెదిరించడంతో భయపడిన తన కుమారై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 305,504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.