మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

10 Dead many injured as bus collides with truck on nashik shirdi highway. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By అంజి
Published on : 13 Jan 2023 10:31 AM IST

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం వేగంగా వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో పది మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌ నుంచి ప్రైవేట్‌ లగ్జరీ బస్సు అహ్మద్‌నగర్‌ జిల్లాలోని దేవాలయాల పట్టణం షిర్డీకి వెళ్తోంది. ముంబైకి 180 కిలోమీటర్ల దూరంలో నాసిక్‌లోని సిన్నార్ తహసీల్‌లోని పఠారే శివర్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఒక పురుషుడు ఉన్నారు. క్షతగాత్రులను సిన్నార్ గ్రామీణ ఆసుపత్రికి, సిన్నార్‌లోని యశ్వంత్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నాసిక్-షిర్డీ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.


Next Story