ఆ ఎనిమిది మంది ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ల పెళ్లిళ్లు వాయిదా.. ఎందుకంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2020 4:02 PM GMT
ఆ ఎనిమిది మంది ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ల పెళ్లిళ్లు వాయిదా.. ఎందుకంటే..?

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దాటికి క్రీడారంగం కుదేలైంది. క‌రోనా ముప్పుతో ప‌లు టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వైర‌స్ క‌ట్ట‌డికి చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.

క‌రోనా దెబ్బ‌కి 8 మంది ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ల పెళ్లి వాయిదా ప‌డింది. ఈ జాబితాలో విధ్వంసక ఆట‌గాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా, ప్యాట్‌క‌మిన్స్‌, జాక్సన్ బర్డ్, డిఆర్సి షార్ట్, మిషెల్ స్వెప‌న్‌, అలిస్టర్ మేక్ డ‌ర్మెట్‌, అండ్రూ టై, జెస్ జెనాసెన్‌, కేట‌లీన్ ప్ర‌యోట్ ఉన్నారు.

మార్చి సీజ‌న్‌తో ఆస్ట్రేలియాలో క్రికెట్ సీజ‌న్ కంప్లీట్ అవుతుంది. దీంతో చాలా మంది క్రికెట్ల‌ర్లు ఈ స‌మ‌యంలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ద‌మ‌వుతుంటారు. క‌రోనా ముప్పుతో.. ఆస్ట్రేలియా ఇప్ప‌టికే లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. దీంతో క్రికెటర్లు పెళ్లిని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

మరోవైపు గ్లెన్ మాక్స్ వెల్ భారత సంతతికి చెందిన వినీ రామ‌న్‌తో గ‌తంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. క‌మిన్స్‌తోపాటు మ్యాక్సీల‌ పెళ్లి రోజు క‌న్ఫామ్‌ కాకపోయినప్పటికీ వీళ్లిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేరు. లాక్‌డౌన్‌ కారణంగా ఒక వేడుకలో పాల్గొనేందుకు ఇద్ద‌రు నుంచి ఐదుగురికి మాత్ర‌మే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ప్ర‌స్తుత పరిస్థితి సద్దుమణిగాక పెళ్లి చేసుకోవాలని ఈ క్రికెటర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వైరస్ కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివ‌ర‌కు 5500 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 30 మంది మరణించారు.

Next Story