అంతిమ సమరం నేడే.. విజయం ఎవరిదో..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Dec 2019 4:12 PM ISTపర్యాటక విండీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమమైన విషయం విదితమే. అయితే సిరీస్‌ను నిర్ణయించే మూడోదైన చివరి టీ20 నేడు వాంఖడే వేదికగా జరగనుంది. దీంతో.. సిరీస్ కోసం కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కసరత్తులు చేస్తున్నాయి.
రెండో టీ20లో నెగ్గి ఊపుమీదున్న విండీస్‌కు సారథ్యం వహిస్తున్న కీరన్ పొలార్డ్‌కు వాంఖడే ‘సొంత’ మైదానంలాంటిది. ముంబై ఇండియన్స్ ఆటగాడిగా ఇక్కడి పరిస్థితులు, పిచ్‌పై అతడికి సంపూర్ణ అవగాహన ఉంది. దీనికి తోడు బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఫామ్‌లో ఉండడంతో విండీస్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమనిపిస్తోంది.
ఇదిలావుంటే.. ఇదే వేదికపై విండీస్ 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియాకు షాకిచ్చి ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు ఏకంగా భారత్‌పై సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.
ఇక టీమిండియా విషయానికొస్తే.. రెండో టీ20లో యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను వన్‌డౌన్‌లో ఆడించింది. టాపార్డర్‌లో కోహ్లీ చేసిన ఈ ప్రయోగం పనిచేసింది. దూబే తనకు అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అయితే మరోసారి కోహ్లీ.. దూబేకు ఈ అవకాశం కల్పిస్తాడా..? లేదా.. అనేది వేచి చూడాలి మరి. ఇక జట్టులో స్థానం కోసం వేసిచూస్తున్న సంజూ శాంసన్ ను రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఆడిస్తారేమో చూడాలి.
బౌలింగ్ విషయానికొస్తే.. దీపక్ చాహర్, భువనేశ్వర్ అంతగా ప్రభావం చూపడం లేదు. చాహర్ స్థానంలో ఫామ్ లో ఉన్న షమీని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మన అటగాళ్లు ఫీల్డింగ్‌లో విఫలమవుతుండడం జట్టుకు తలనొప్పిగా మారింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఏడు క్యాచ్‌లను వదిలేశారు. ఇది ఆందోళన కలిగించే విషయం.
టీమిండియా: రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, జడేజా/షమి, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, భువనేశ్వర్, యజువేంద్ర చాహల్.
విండీస్: లెండన్ సిమ్మన్స్, ఎవిన్ లూయిస్, కింగ్, షిమ్రాన్ హెట్‌మయెర్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జాసన్ హోల్డర్, పియెర్, విలియమ్స్, షెల్డన్ కాట్రెల్, హేడెన్ వాల్ష్.