క్రికెట్ బెట్టింగ్ గొడవ.. డబ్బులు ఇవ్వాలంటూ విద్యార్థిపై దాడి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Oct 2019 3:22 PM ISTపశ్చిమ గోదావరి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పేరుతో ఓ విద్యార్థిపై మరో విద్యార్థి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి వాసవీ కాలేజీలో క్రికెట్ బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలంటూ విద్యార్థిపై మరో విద్యార్థి దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను తన స్నేహితుల మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వాట్సప్‌లో హల్ చల్ చేయడంతో విషయం బయటకు పొక్కింది.
గత నెలలో జరిగిన ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోకుండా పంచాయితీలతో కాలయాపన చేస్తోంది. బాధిత విద్యార్థి క్రికెట్ బెట్టింగ్ డబ్బుల విషయంలో వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. అయితే తమకు ఇంకా డబ్బులు రావాలంటూ ఆ విద్యార్థిపై సహచర విద్యార్థులు కొట్లాటకు దిగారు. బాధిత విద్యార్థి తండ్రి బస్సు ఫీజు కట్టమని డబ్బు ఇవ్వగా ఆ డబ్బులను విద్యార్థి నుంచి లాక్కొని వేధింపులకు గురి చేశారు. తన డబ్బు తనకు ఇవ్వాలని ప్రాధేయపడిన బాధిత విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం సరిగా పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.