సీఆర్డీఏ చట్టం రద్దుకు జగన్ సర్కార్ కసరత్తు..!
By సుభాష్ Published on 13 Jan 2020 9:09 PM IST![సీఆర్డీఏ చట్టం రద్దుకు జగన్ సర్కార్ కసరత్తు..! సీఆర్డీఏ చట్టం రద్దుకు జగన్ సర్కార్ కసరత్తు..!](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/01/CRDA-Act-Andhrapradesh.jpg)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా అమరావతి నుంచి పరిపాలనా రాజధానిని విశాఖపట్నంకు తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించబోతోంది. ఈ సమావేశాల్లో రాజధానికి సంబంధించి కీలక చర్చ జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అమరావతి కోసం గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో రూపొందించిన సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా ఈరోజు జరిగిన సమావేశంలో చర్చ జరిగింది.
అలాగే ఇతర శాఖల నుంచి సీఆర్డీఏకు డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి పని చేస్తున్న ఉద్యోగులపైన సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఆర్డీఏ చట్టం రద్దుకు కసరత్తు, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కేపిటల్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీగా గుర్తించి, అక్కడ అమలు చేయాల్సిన నిర్ణయాలు, చట్టం రూపంలో సీఆర్డీఏ చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదనలతో పాటు అసెంబ్లీ లెజిస్టేచర్ కేపిటల్‌గా కొనసాగించాలని భావిస్తోంది.